హరీశ్ రావుపై సంచలన కామెంట్స్ చేసిన మైనంపల్లి హన్మంతరావు.. తన కుమారుడే తనకు ముఖ్యమని అన్నారు. తన తనయుడికి టికెటి ఇస్తే గెలిపించుకుని వస్తానంటూ ధీమాగా మాట్లాడారు. ‘నన్ను ఇబ్బంది పెట్టిన వారిని కచ్చితంగా ఇబ్బంది పెడతా.. నిన్న నేను పార్టీని విమర్శించలేదు.. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పా.. నా కుమారుడే నాకు ముఖ్యం.. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు.. మెదక్, మల్కాజిగిరి ప్రజలే నాకు ప్రధానం.. పార్టీలకు అతీతంగా ఉంటా’ అంటూ మైనంపల్లి అన్నారు. హైదరాబాద్ వచ్చాక తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. నిన్న BRS టికెట్ల ప్రకటనకు ముందు మైనంపల్లి తిరుమలలో మాట్లాడారు. మంత్రి హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రబ్బరు చెప్పులతో తిరిగిన వ్యక్తి లక్ష కోట్లు ఎలా సంపాదించారంటూ ఫైర్ అయ్యారు. తనకు, తన కుమారుడికి రెండు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పొద్దున పూట ఇది జరగ్గా.. మధ్యాహ్నానికి లిస్ట్ ను KCR ప్రకటించారు. ఆ లిస్టులో మైనంపల్లి హన్మంతరావు పేరు ఉంది. కొన్ని చోట్ల నుంచి వచ్చిన కామెంట్స్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానమిచ్చారు. టికెట్లు ప్రకటించాం.. పోటీ చేస్తారా లేదా అనేది వారి ఇష్టం అంటూ మాట్లాడారు. ఇక హరీశ్ రావుపై మైనంపల్లి చేసిన హాట్ కామెంట్స్ మీద కేటీఆర్, కవిత స్పందించారు. హరీశ్ రావు పార్టీకి కీలకం అంటూ అమెరికా పర్యటన నుంచే KTR మెసేజ్ ఇచ్చారు. ఇక కవిత సైతం అదే తీరుగా మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో మైనంపల్లి ఈరోజు మళ్లీ రెస్పాండ్ అయ్యారు. ఇవాళ మాట్లాడిన మాటలతో మైనంపల్లి పార్టీలో ఉంటారా, లేదా అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వచ్చాక కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పడంతో పార్టీలో ఉంటారా లేదా అన్నది పార్టీలో ప్రధాన చర్చగా మారింది.