
వేలాదిగా అభ్యర్థులు… రోడ్లపై ర్యాలీ… ఇదీ గ్రూప్-2 వాయిదా వేయాలంటూ హైదరాబాద్ అభ్యర్థులు చేపట్టిన నిరసన. ఎటుచూసినా జనమే అన్నట్లుగా అన్ని జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో గ్రూప్-2 రాసే అభ్యర్థులు TSPSC కార్యాలయానికి చేరుకున్నారు. వీరికి కాంగ్రెస్, TJS సహా వివిధ సంఘాలు మద్దతు తెలపడంతో ఉదయం 11 గంటల నుంచే TSPSC ఆఫీసు వద్ద సందడి కనిపించింది. ఎంతకీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ అభ్యర్థులంతా ర్యాలీ తీశారు. TSPSC ఆఫీసు వద్దకు పోలీసులు రానివ్వకపోవడంతో.. పక్కనున్న గ్రౌండ్ లో బైఠాయించారు. అభ్యర్థులు బయటకు వెళ్లకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందని ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నిరసనకారులు పట్టు విడవలేదు. ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలని, TSPSC అధికారులు జవాబు చెప్పాలంటూ తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు.
గ్రౌండ్ నుంచి పోలీసులు వెళ్లగొట్టడంతో నాంపల్లిలోని మెట్రో స్టేషన్ వద్ద ఆందోళన కొనసాగించారు. ఎంత చెప్పినా అభ్యర్థులు వినకపోవడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేశారు. దీంతో నాంపల్లి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అభ్యర్థులను అరెస్టు చేసిన పోలీసులు… వారిని ఠాణాలకు తరలించారు. ఇంతటి స్థాయిలో జనాలు వస్తారని పోలీసులు కూడా గుర్తించలేదు.