
ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు వరద నీరు(Flood Water) వచ్చి చేరుతోంది. ఇప్పటికే గోదావరికి ప్రమాదకరంగా ఫ్లో(Flow) ఉండగా, కృష్ణానదికి సైతం వరద పెద్దయెత్తున వస్తోంది. ఆల్మట్టి డ్యాంకు వేగంగా ఫ్లడ్ పెరుగుతోంది. 1,38,000 క్యూసెక్కులు వస్తుండగా, 1,25,000 క్యూసెక్కుల్ని కిందకు వదులుతున్నారు. ఇది మరింత పెరిగే అవకాశముంది. రాష్ట్రంలో కృష్ణానదిపై తొలి ప్రాజెక్టు అయిన జూరాలకు ఈ ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 48 వేల క్యూసెక్కులుండగా.. 52,856 క్యూసెక్కుల్ని విడిచిపెడుతున్నారు. జూరాల ఫుల్ కెపాసిటీ 318.51 మీటర్లకు గాను ప్రస్తుతం 318.31 మీటర్లకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 9.65 TMCలకు గాను ప్రస్తుతం 9.23 TMCల నీరుంది.
SRSPకి ఇంచుమించు లక్ష క్యూసెక్కులు వస్తుండగా.. ముందు జాగ్రత్తగా గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1087 అడుగులుగా ఉంది. 90 TMCల గరిష్ఠ నీటిమట్టానికి గాను 75 TMCల నిల్వ ఉంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు 3.54 లక్షల క్యూసెక్కుల కెపాసిటీతో ఉండగా.. 3.87 లక్షల ఇన్ ఫ్లో ఉంటోంది. 14 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులకు గాను పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని ప్రస్తుతం ఇంచుమించు 700 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.