ఎండలు తగ్గాయి.. ఇది వర్షాకాలం కదా కరెంటుతో ఏం పని అనుకుంటున్నారేమో. కానీ ఈ రోజు ఎండాకాలం కన్నా ఎక్కువగా కరెంటును వాడుకున్నారని తేలింది. విద్యుత్తు డిమాండ్ ఈ రోజు రికార్డు స్థాయిలో నమోదైందని ట్రాన్స్ కో ప్రకటించింది. భగభగ మండే ఎండలు నమోదైన మే నెలలోనూ ఈ స్థాయిలో కరెంటు వాడుకోలేదని, ఇవాళ నమోదైన రికార్డులు చెబుతున్నాయి. అంచనాలకు మించి ఈ రోజు రాష్ట్రంలో కరెంటుకు డిమాండ్ ఏర్పడింది. ఎన్నడూ లేని రీతిలో 14,136 మెగావాట్ల విద్యుత్తును వాడారని ట్రాన్స్ కో తెలిపింది. పొద్దున 11:01 గంటలకు ఈ రికార్డు క్రియేట్ అయిందని స్పష్టం చేసింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వానాకాలంలో ఈ స్థాయి వినియోగం నమోదు కావడం సరికొత్త రికార్డ్ గా ట్రాన్స్ కో, జెన్ కో CMD చెబుతున్నారు.
వర్షాలు లేకపోవడం, పంటల విస్తీర్ణం పెరగడమే విద్యుత్తు డిమాండ్ కు కారణంగా చెబుతున్నారు. గత సంవత్సరం ఇదే రోజు 12,251 మెగావాట్ల మేర కరెంటును ప్రజలు వాడుకున్నారు. మరోవైపు ఇంతకన్నా ఎక్కువగా డిమాండ్ ఉన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని CMD ప్రకటించారు.