Published 28 Nov 2023
కామారెడ్డి(Kamareddy)… ఇద్దరు అగ్రనేతలు(Top Leaders) పోటీపడుతున్న ఆ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎవరు గెలుస్తారు, ఆధిక్యం ఎంత అన్న లెక్కలపైనే అందరి దృష్టీ ఉంది. గత కొన్ని రోజులుగా అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ఆ నియోజకవర్గంలో ఇక తాయిలాలకు కొదవేం ఉంటుంది. ఆ కోణంలోనే చూపు సారించిన అధికారులకు భారీగా నగదు దొరికింది. అనుమానంతో తనిఖీలకు దిగిన ఎన్నికల స్క్వాడ్, పోలీసు సిబ్బందికి రూ.60 లక్షలు కంటపడ్డాయి. నగదు దాచారన్న పక్కా సమాచారంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. అనుకున్నట్లుగా అక్కడ పెద్దయెత్తున నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ముక్కోణపు పోరు హోరాహోరీ
ముఖ్యమంత్రి KCR, PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు ముందు నుంచి జనాల్లోకి చొచ్చుకెళ్లిన వెంకటరమణారెడ్డి BJP నుంచి బరిలో ఉన్నారు. ముగ్గురికి ఇది ప్రతిష్ఠాత్మకం కావడంతో కామారెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎంను ఓడించాలని విపక్షాలు, ప్రతిపక్షాలకు చుక్కలు చూపించాలని CM వర్గం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా తాయిలాలు ముట్టజెప్పే ఛాన్సెస్ ఉన్నాయన్న కోణంలో ఎలక్షన్ కమిషన్ సునిశిత దృష్టి సారించి బలగాల్ని మోహరించింది. అనుమానం వచ్చిన ప్రతిచోటా తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు అందాయి.