ఒకేసారి వేలాది మంది ప్యాసింజర్స్ తరలిరావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గజిబిజిగా తయారైంది. హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్తున్న వారితో రోజూ కిటకిటాడుతున్నది. పంద్రాగస్టు సందర్భంగా ఇప్పటికే ఎయిర్ పోర్టులో ఈ నెల 20 వరకు ‘హై అలర్ట్’ ప్రకటించారు. శంషాబాద్ నుంచి గత వారం రోజుల్లో నిత్యం విదేశాలకు 10 వేల మంది, స్వదేశంలో 50 వేల మంది జర్నీ చేస్తున్నారు. పై చదువుల కోసమే రోజూ 5,000 మంది ట్రావెల్ చేస్తుండగా, వారి వెంట వస్తున్న వారితో ఎయిర్ పోర్ట్ లో కొన్నిసార్లు అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదంటున్నారు అక్కడి అధికారులు. అమెరికా, కెనడాలకు ఉన్నత విద్య కోసం ఎక్కువగా వెళ్తుండగా, ఒక్కో ప్యాసింజర్ వెంట 10 నుంచి 20 మంది దాకా కుటుంబ సభ్యులు, సన్నిహితులు వస్తున్నారట. దీంతో ఇక నుంచి ముగ్గురు లేదా నలుగురు మాత్రమే రావాలని చెబుతున్నారు. జర్నీ చేయబోయే వ్యక్తులతో ఎక్కువమంది రాకూడదని ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు. ఈ మూడు నెలలు జులై, ఆగస్టు, సెప్టెంబరులోనే ఈ పరిస్థితి కనిపిస్తుంది.
ఏటేటా అంతకంతకూ పెరుగుతున్న ప్యాసింజర్స్
ఈ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రతి మూడు నిమిషాలకో ఫ్లైట్ రాకపోకలు సాగిస్తున్నది. అలా నిత్యం 700కు పైగా ఫ్లైట్ లు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోవైపు 2022లో 16 లక్షల మంది శంషాబాద్ నుంచి ట్రావెల్ చేయగా… ఈ ఎనిమిదిన్నర నెలల్లోనే 20 లక్షల మంది దాకా ట్రావెల్ చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు. ఈ లెక్కన గతేడాదితో పోల్చుకుంటే 50 నుంచి 70 శాతం ఆక్యుపెన్సీ అడిషనల్ గా పెరిగే అవకాశం కనిపిస్తున్నది.