అంతకంతకూ దిగజారిపోయిన భూగర్భజలాల(Ground Water Levels)తో కర్ణాటక రాజధాని బెంగళూరు పడుతున్న కష్టాలు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. గుక్కెడు నీరు మహాప్రభో అంటూ గొంతు చించుకుంటున్న పరిస్థితి కన్నడిగుల ప్రధాన నగరంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నది. మరి ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో హైదరాబాద్ కూ తప్పదా… ఇక్కడ కూడా అలాంటి వాతావరణమే ముంచుకొస్తుందా… రానున్న రెండు నెలలు ఎలా ఉండబోతున్నాయి… అనేవి ఆశ్చర్యకరంగా మారాయి.
79 శాతం లోటుతో…
కాంక్రీట్ జంగిల్(Concrete Structures) పెద్దయెత్తున పెరిగిపోతుండటమే బెంగళూరు నీటి కష్టాలకు కారణమని తాజా సర్వేలో బయటపడింది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IIS) రిపోర్ట్ ప్రకారం బెంగళూరులో 79% నీటి నిల్వలు పడిపోయాయి. 1973లో 8%గా ఉన్న నిర్మాణ ఏరియా(Built-up Area) 2023 నాటికి 93%నికి చేరుకుంది. అంటే బెంగళూరు మొత్తంలో 93 శాతం మేర పెరిగిన నిర్మాణాలతో 79 శాతం మేర నీటి నిల్వలు దెబ్బతిన్నట్లు IIS స్పష్టం చేసింది. ఇంకుడు గుంతలు కనిపించకుండా పోవడమే ఇందుకు మెయిన్ రీజన్ అని తెలిపింది.
భాగ్యనగరంలోనూ…
భాగ్యనగరం కూడా బెంగళూరు పరిస్థితికి ఎంతమాత్రం దూరంలో లేదని IIS సర్వే అంచనా వేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ(MAUD) లెక్కల ప్రకారం 2010-2014 కాలంలో 50.7 మిలియన్ల చదరపు అడుగుల్లో(Sft) కమర్షియల్ నిర్మాణాలు జరిగాయి. 2015-2019 మధ్య 100.4 మిలియన్ల చదరపు అడుగులకు అవి చేరుకున్నాయి. కమర్షియల్ వే ఇలా ఉంటే ఇక 2015 నుంచి 2021 వరకు ఆరేళ్ల కాలంలో నివాస సముదాయాల(Residential) కట్టడాలు 500 మిలియన్ల Sftకి చేరుకున్నాయి. పూర్తిస్థాయి లెక్కలు అందుబాటులో లేకున్నా అంచనాల ప్రకారం గత మూడేళ్లలోనే 70% నుంచి 80% నిర్మాణాలు పెరిగినట్లు IIS తెలిపిందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వార్త ప్రచురించింది.
కాంక్రీటైజేషన్…
పట్టణీకరణగా పిలుచుకుంటున్న కాంక్రీటైజేషన్(Concretisation) వల్ల ఈ మార్చిలోనే నీటి కొరత కనిపిస్తున్నదని IIS రిపోర్ట్ తెలిపింది. ఈ కాంక్రీటైజేషన్ వల్ల భూగర్భ జలాల్ని పెంచుకునే ఛాన్స్ లేదు. వాన నీటిని కాపాడుకునే స్థానంలో మురుగు నీరు, కాలుష్య జలాలు పేరుకుపోతున్నాయని.. దీనివల్లే ఏటా వర్షాకాలంలో నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. వాన నీటికి భూమిలోకి పంపిస్తే అందులో 50% నీటిని తిరిగి వాడుకోవచ్చు. కృష్ణా, గోదావరి, మంజీర నదుల నీటిని నిత్యావసరాలకు వాడుకున్నా.. ఈ వాన నీటిని పార్కులు, రోడ్ సైడ్ ఏరియాలు, వన సంరక్షణకు ఉపయోగించవచ్చు. నిర్మాణాల్లోనూ 200 చదరపు మీటర్ల మేర ఇంకుడు గుంత పెట్టుకునే అవకాశమున్నా దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని నిపుణులు ఆవేదన చెందుతున్నారు.
నిర్వీర్య వ్యవస్థ…
హైదరాబాద్ మహానగరంలో 185 నోటిఫైడ్ వాటర్ బాడీలు(Water Bodies) ఉంటే అందులో 150 కలుషిత(Polluted)మయ్యాయని రిపోర్ట్ తెలియజేసింది. మరో 20 పూర్తిగా ఎండిపోయినట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(PCB) రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా 300 వాటర్ బాడీలు ఉన్నా అందులో నోటిఫై కాకుండా వృథాగా పడి ఉన్నాయి. బిల్డింగ్స్ పర్మిషన్స్ విచ్చలవిడి కావడమే ప్రమాదానికి కారణంగా నిలవబోతుందట. 2016లో సర్కారు తెచ్చిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్(DPMS) అనే ఆన్ లైన్ విధానం వల్ల పర్మిషన్లు ఈజీ అయినట్లు తెలిపింది. 2019-2020లో GHMC పరిధిలో 17,538 బిల్డింగ్ పర్మిషన్లకు గాను రూ.986.4 కోట్లు ఆదాయం రాగా.. నాలుగేళ్ల కాలంలోనే ఇది 100% పెరిగినట్లు IIS తెలిపింది.