
IAS, IPSలను బదిలీలు చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై మహిళా ఐఏఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ట్రాన్స్ ఫర్ చేసిన 20 మంది ఉన్నతాధికారుల్లో సీనియర్ IAS అయిన టి.కె.శ్రీదేవి కూడా ఉన్నారు. ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్న ఆమె.. ‘X(ట్విటర్)’ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఎన్నికల సంఘం టూర్ కు మూడు రోజుల ముందే ఈ మహిళా ఐఏఎస్.. వాణిజ్య పన్నుల శాఖ(Commercial Tax Department) కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక శాఖ సెక్రటరీగా ఉన్న శ్రీదేవికి అడిషనల్ గా కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్ ను ప్రభుత్వం అప్పజెప్పింది. శ్రీదేవిని నియమిస్తూ సెప్టెంబరు 25న రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి ఆమెను తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఈ పరిణామం వల్ల ఆమె ఎన్నికల డ్యూటీ చేయలేని తీరు ఏర్పడింది. ఒకరకంగా ఇది ఆమెకు ఇబ్బందికర పరిస్థితి కాగా.. ఆవేదనతో శ్రీదేవి పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
దీనిపై శ్రీదేవి బాధను వ్యక్తం చేస్తూ ‘ఇటీవలే బాధ్యతలు తీసుకుంటే ఆ శాఖకు తానెలా బాధ్యురాలిని అవుతాను.. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు మూడు రోజుల ముందు బాధ్యతలు తీసుకున్నా.. ఆ శాఖకు నేనెలా బాధ్యురాలిని అవుతాను’ అంటూ ట్వీట్ చేశారు. శ్రీదేవి గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.