Published 02 Jan 2024
ఆయన సుదీర్ఘకాలం పాటు ఒకే పోస్ట్ లో ఉన్నారు. గత ప్రభుత్వ పదేళ్ల కాలంలో తొమ్మిదేళ్లుగా ప్రధాన సంస్థకు CMD(Chairman And Managing Director)గా పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పుడాయన పదవీకాలం పూర్తి కావడంతో ప్రభుత్వం వెంటనే ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. CMD పదవీకాలం పూర్తి కాగానే GAD(జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్)కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరొందిన సింగరేణికి.. CMDగా వ్యవహరిస్తున్న 1997 IAS బ్యాచ్ అధికారి ఎన్.శ్రీధర్ ఈ నెల 31 నాటికే తన పదవీకాలాన్ని కంప్లీట్ చేసుకున్నారు. దీంతో ఆయన్ను SCCL(సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్) నుంచి జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) శాంతికుమారి ఆర్డర్స్ ఇచ్చారు.
ఐఆర్ఎస్ కు బాధ్యతలు
శ్రీధర్ స్థానంలో IRS అధికారికి ఇంఛార్జి బాధ్యతలు కట్టబెట్టారు. ప్రస్తుతం సింగరేణిలోనే ఫైనాన్స్ డైరెక్టర్ గా ఉన్న ఎన్.బలరామ్.. FAC(ఫుల్ అడిషనల్ ఛార్జ్)గా సీఎండీ బాధ్యతలు చూడబోతున్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ పదవిలో బలరామ్ కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో అత్యంత విమర్శనాత్మక అంశంగా మిగిలిపోయిన పోస్టుగా సింగరేణి సీఎండీ నిలిచిపోయింది.
ఈ సీనియర్ ఐఏఎస్ పై…
ఇక సింగరేణి CMDగా పనిచేసిన శ్రీధర్ కంటిన్యుటీపై పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. 9 ఏళ్ల పాటు ఒకే పోస్ట్ లో ఉండటం, సింగరేణి వ్యవహారాల్లో భారీగా అవినీతి, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడం, ఈ ఎన్నికలకు ముందు విపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు విమర్శలు చేయడంతో సింగరేణి సీఎండీ పోస్టు హాట్ హాట్ గా మారింది. సాక్షాత్తూ అప్పుడు ప్రధాన విపక్ష నేతగా రేవంత్ రెడ్డి సైతం ఈ కంటిన్యూ పోస్టింగ్ పై పలుసార్లు KCR సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రం నుంచి పొడిగింపు ఉత్తర్వులు తెచ్చుకుంటూ CMDగా శ్రీధర్ ను కొనసాగించిన వ్యవహారం పెద్ద దుమారానికి కారణమైనా.. గత ప్రభుత్వం ఆయనపై ఉంచిన నమ్మకంతో ఏళ్లకేళ్లపాటు అక్కడ ఈ సీనియర్ ఐఏఎసే కొనసాగారు.