సాధారణ వ్యక్తుల కన్నా దివ్యాంగులే నీతి, నిజాయతీతో పనిచేస్తారని, వారు ఉద్యోగాల్లో ఉండటం వల్ల అందరికీ మేలు జరుగుతుందని BC సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. తాను కలెక్టర్ గా ఉన్నప్పుడు ఎంతోమంది దివ్యాంగులకు జాబ్స్ ఇప్పించానని, ఇప్పుడు వారంతా చాలా బాగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ట్రైన్(TRRAIN), రైస్(RICE), హజారీ గ్రూప్ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా కాలేజీలో జాబ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటేశం… అంగ వైకల్యం ఉన్నవారిని అవహేళన చేయకూడదన్నారు. వివిధ కంపెనీలు, సంస్థలు ఇలాంటి వారికి జాబ్స్ ఇవ్వడం వల్ల ఆశించిన గమ్యాన్ని త్వరగా చేరుకుంటారని తెలిపారు. ట్రైన్, రైస్, హజారీ గ్రూప్ చేస్తున్న సేవల్ని కొనియాడారు. ఈ జాబ్ మేళా ద్వారా 800 నుంచి 1,000 మందికి ఉద్యోగాలు కల్పించారు.
దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ట్రెయినింగ్ ఇచ్చి మరీ రాష్ట్ర ప్రభుత్వం జాబ్స్ కల్పిస్తున్నదని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని రాష్ట్ర PWD డిపార్ట్ మెంట్ కమిషనర్ బి.శైలజ కోరారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు గల దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఈ జాబ్ మేళాకు అటెండ్ అయ్యారు. అనంతరం బుర్రా వెంకటేశం.. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజేంద్ర, కాలేజ్ ప్రిన్సిపల్ వరలక్ష్మీ, ట్రైన్ సౌత్ ఇండియా హెడ్ సురేశ్, రైస్ నిర్వాహకుడు ఎం.అమరేందర్ గౌడ్, హజారీ సంస్థ హెడ్ ప్రవీణ్ తోపాటు కాలేజ్ లెక్చరర్లు, NSS యూనిట్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.