ఆగస్టు మొత్తానికే ముఖం చాటేసిన వర్షాలు.. రైతులపై ఎంతటి ప్రభావాన్ని చూపాయో తెలిసిందే. అయితే కుంభ వృష్టి, లేదంటే అనావృష్టి అన్నట్లుంది వాతావరణం తీరు. కుండపోతగా కురిసిన వానలతో జులై చివరి వారం వరకు ఆందోళనకర పరిస్థితులు తలెత్తగా ఆ తర్వాత నెల రోజులు అంటే ఆగస్టు నెల మొత్తం వరకు ఒక్కసారిగా గట్టి వర్షం పడలేదు. రాష్ట్రంలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా పంటలపై పెట్టిన పెట్టుబడులన్నీ వృథా అయిపోయాయి. దీంతో కర్షకులు భారీగా నష్టపోవడమే కాకుండా ఇప్పటివరకు పంటలు మొలకెత్తే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ కేంద్రం ఎట్టకేలకు చల్లని కబురు చెప్పింది. సెప్టెంబరు మొదటి వారమంతా మోస్తరు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు ఆవర్తనాల వల్ల రాష్ట్రంలో వర్షాలు పడతాయని అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఆవర్తనం కేంద్రీకృతమైంది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబరు 4న మరో ఆవర్తనం ఏర్పడుతున్నదని IMD తెలిపింది. సెప్టెంబరు 2, 3 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు ఉంటాయని ప్రకటించింది.