గవర్నర్(Governor) తమిళిసై సౌందరరాజన్ రాజీనామా(Resignation)తో ఏర్పడ్డ ఖాళీని.. మరో రాష్ట్ర గవర్నర్ కు బాధ్యతలు కట్టబెడుతూ కేంద్రం నిర్ణయించింది. తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో ఆమె స్థానంలో మరొకర్ని నియమించాల్సి ఉండగా… జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు(For Additional Charge) కట్టబెట్టారు. తెలంగాణకే కాకుండా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ రాధాకృష్ణన్ వ్యవహరిస్తారు.
ఎన్నికల కోడ్ దృష్ట్యా…
కొత్త గవర్నర్ ను నియమించేందుకు తగిన సమయం అవసరం. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్(Model Code) అమలులో ఉన్నందున కొత్త గవర్నర్ ను ఎంపిక చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా ఏదో ఒక రాష్ట్రానికి చెందిన గవర్నర్ కు అదనపు బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా, జార్ఖండ్ గవర్నర్ ను తాత్కాలిక సర్దుబాటు చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. 2019 సెప్టెంబరు 8న రాష్ట్రానికి వచ్చిన తమిళిసై ఇక్కడ నాలుగున్నరేళ్లకు పైగా.. అటు 2021 ఫిబ్రవరి 18 నుంచి పుదుచ్చేరి ఇంఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ గా మూడేళ్లపాటు సేవలందించారు.
పుదుచ్చేరికి సైతం…
అటు తమిళిసై తెలంగాణతోపాటు పుదుచ్చేరికి కూడా ఇంఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉండటంతో ఇప్పుడు అక్కడ కూడా ఒకరు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. దీంతో తెలంగాణతోపాటు పుదుచ్చేరికి సైతం సి.పి.రాధాకృష్ణనే ఉంటారని కేంద్రం ప్రకటించింది. ఇలా జార్ఖండ్ తోపాటు తెలంగాణ, పుదుచ్చేరితో కలిపి మూడు రాష్ట్రాల్ని రాధాకృష్ణన్ చూసుకుంటారు. కొత్త గవర్నర్ల నియామకం జరిగే వరకు ఈయనే ఇంఛార్జిగా వ్యవహరిస్తారు.