ఇళ్లు లేని నిరుపేదలకు స్థలం ఇవ్వడంతోపాటు నిర్మాణానికి రూ.5 లక్షలు చెల్లించే ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు చెల్లించాలనేది కాంగ్రెస్ పార్టీ హామీ. అనుకున్నట్లుగానే ఈ పథకాన్ని ఈ నెల 11న ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సదస్సుల్లో ఈ స్కీమ్ కోసం 82 లక్షల మంది దరఖాస్తు(Apply) చేసుకున్నారు. అయితే ఇందులో కొంతమంది వేర్వేరు ప్రాంతాల్లో అప్లై చేసుకోగా.. ఇక ఒకే కుటుంబానికి చెందిన కొందరు విడివిడిగా దరఖాస్తు చేసుకున్నట్లు మొన్నటి వడపోత కార్యక్రమంలో గుర్తించారు.
గైడ్ లైన్స్ కోసం…
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో కలిసి CM సమీక్ష నిర్వహించారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేయబోతున్న ‘ఇందిరమ్మ ఇళ్లు’ స్కీమ్ కు రెడీగా ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విధివిధానాలు, నిబంధనలు తయారు చేయాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం ఎంతమంది లబ్ధిదారుల(Beneficiars)ను ఎంపిక చేయాలి.. ఎంత మేర నిధులు కేటాయించాలన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల నివాసాలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రెండు రకాలుగా అమలు చేస్తామని మొన్నటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
వాటి ఆధారంగానే…
లబ్ధిదారుల సంఖ్య, నిధుల సమీకరణపైనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆధారపడి ఉంది. ఇల్లు కేటాయించిన పక్షంలో నిర్మాణానికి గాను ఏయో దశల్లో(Phases) ఒక్కో లబ్ధిదారుడికి ఎంత చెల్లింపులు చేయాలన్నది కూడా తేలాల్సి ఉంది. అర్హుల ఎంపికకు సంబంధించిన గైడ్ లైన్స్ తయారు కావాల్సి ఉండగా, గతంలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఎలా అమలు చేశారన్నది లెక్కలోకి తీసుకుంటున్నారు. మరోవైపు గత BRS సర్కారు ప్రకటించిన గృహలక్ష్మీ నిబంధనల్ని సైతం అధికారులు పరిశీలిస్తుండగా.. వాటిల్లో ఏది మెరుగ్గా(Best) ఉంటే దాన్నే పరిగణలోకి తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తున్నది.