పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. ఉన్నత చదువుల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో తాను పడ్డ అవస్థలు మరెవరికీ రాకూడదని భావించారు. జీవితంలో స్థిరపడ్డాక తనలాంటి వాళ్లకు దారి చూపాలని ఆనాడే మనసులో అనుకున్నారు. చాలా మంది ఇలాగే అనుకుంటారు.. కానీ అసలు సమయం వచ్చేసరికి అన్నీ మరచిపోతారు. కానీ ఈ పోలీస్ ఇన్స్ పెక్టర్ మాత్రం తను నమ్మిన సిద్ధాంతాన్ని మరచిపోలేదు. ఈ అధికారి ఆర్థికంగా చేయూత అందించడంతో 12 మంది యువత జీవితాల్లో వెలుగులు విరబూశాయి. అలా మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు CI కొన్ని సైదులు. హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ సైదులు.. గతంలో ఎస్సార్ నగర్ లో విధులు నిర్వర్తిస్తున్న సయయంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. తన ఠాణా లిమిట్స్ లో చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారని, కోచింగ్ తీసుకునే స్థోమత లేదని తెలుసుకున్నారు.
స్పెషల్ గా రీడింగ్ రూమ్
చేయూత అందించాలన్న లక్ష్యంతో కానిస్టేబుల్ పరీక్షార్థులకు తన స్టేషన్ మూడో ఫ్లోర్ లో రీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. తన డబ్బుతోపాటు స్థానిక దాతల సహకారంతో 23 మందికి ప్రైవేట్ సెంటర్ లో కోచింగ్ ఇప్పించారు. సైదులు చూపిన దారిలో తామూ నడవాలన్న లక్ష్యంతో కసిగా చదివిన అభ్యర్థుల్లో 12 మంది వివిధ విభాగాలకు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. గురువారం నాడు ఉద్యోగ నియామకాలు పొందిన అభ్యర్థులు.. తమకు దారి చూపించిన ఇన్స్ పెక్టర్ ను కలుసుకున్నారు. కేవలం ఉద్యోగాలు పొందినవారు మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా సైదులును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకేసారి ఇంతమందికి ఉద్యోగాలు రావడంతో ఇన్స్ పెక్టర్ సైదులు తన్మయత్వానికి గురయ్యారు. వారికి శుభాకాంక్షలు చెబుతూనే మరింత ఉన్నతస్థాయికి ఎదిగి పది మందికి సహాయాన్ని అందించాలన్నారు.