
Published 05 Jan 2024
అపజయం లేనిదే విజయం సులువుగా రాబోదని, పరాజయంలో ఉన్నప్పుడు పలకరించేవారే ఉండరని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. తాను కూడా జీవితంలో చాలా తప్పులు చేశానని, తప్పులు జరగకపోతే విజయాలు రావని గుర్తు చేశారు. హైదరాబాద్ లోని JNTU 12వ స్నాతకోత్సవంలో ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చంద్రయాన్-3 తన జీవితాన్ని మలుపు తిప్పిందన్న సోమనాథ్… ఈ ప్రయోగం దేశం గర్వించేలా చేసిందని తెలిపారు. ‘తాను ఇలా ఉంటానని 25 ఏళ్ల క్రితం అనుకోలేదు.. రాకెట్ తయారీలో ఎన్నో తప్పులు చేశా.. అపజయాలతో కుంగిపోతే లాభం లేదు.. ఆ పరాజయాలు గెలుపునకు బాటలు కావాలి’ అని యువతకు సందేశమిచ్చారు.
అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్ లు, ఇండస్ట్రీస్ రావాలని.. పరాజయాలు పొందడం ద్వారానే మూడు కీలక ప్రాజెక్టుల్లో విజయాలు సాధించామని సోమనాథ్ తెలిపారు. యూనివర్సిటీలతో కలిసి పనిచేసేందుకు గల అవకాశాలు పరిశీలిస్తున్నామన్న సోమనాథ్.. తక్కువ ఖర్చుతోనే ప్రాజెక్టులు చేస్తున్నామన్నారు.