మరో BRS ఎమ్మెల్యేపై IT(Income Tax) డిపార్ట్ మెంట్ కన్ను పడింది. లెక్కలు లేని వ్యవహారాలు నడుస్తున్నాయన్న సమాచారంతో ఒక్కసారిగా దాడులకు దిగారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో IT అధికారులు ప్రత్యక్షమైన అనుమానమున్న ప్రతి ఇల్లు, వ్యాపార సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. MLA నల్లమోతు భాస్కర్ రావు ఇల్లుతోపాటు ఆయన సంబంధీకులు, వివిధ రైస్ మిల్లుల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. భాస్కర్ రావు బంధువుల ఇళ్లన్నింటినీ ఇన్ కం టాక్స్ అధికారులు విడిచిపెట్డడం లేదు. 40 టీమ్ లతో భారీయెత్తున సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. హైదరాబాద్, మిర్యాలగూడ, నల్గొండలో మూకుమ్మడిగా దాడులకు దిగారు అధికారులు. మొత్తం 40 టీమ్ లకు గాను 30 బృందాలు కేవలం నల్గొండపైనే దృష్టిపెట్టాయంటే MLA ఐటీ నజర్ ఎలా ఉందో అర్థమవుతుంది.
బియ్యపు మిల్లులకు ప్రసిద్ధి మిర్యాలగూడ. ఇక్కడ ఎలాంటి రాజకీయ నాయకుడైనా వారి కన్నుసన్నల్లో పనిచేయాల్సిందే. అందుకే ప్రతిసారి దాడులు జరిగినప్పుడల్లా రైస్ మిల్లులపైనే అధికారుల కన్ను ఉంటుంది. ఈసారి కూడా అదే తీరుగా బియ్యపు మిల్లుల్లో భారీయెత్తున సోదాలు సాగిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా భారీగా డబ్బును నిల్వ చేసినట్లు ITకి సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. MLA నల్లమోతు భాస్కర్ రావుకు దేశవ్యాప్తంగా పెద్దయెత్తున వ్యాపారాలు(Business) ఉన్నాయి. పవర్ ప్లాంట్లలోనూ, వివిధ మిల్లుల్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు.