హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. వ్యాపార దిగ్గజాలుగా పేరుపొందిన ముగ్గురు భారాస నేతలే లక్ష్యంగా సాగుతున్నదాడులు కలకలం రేపుతున్నాయి. నేతల ఇళ్లు, కార్యాలయాల వద్ద కేంద్ర బలగాల పర్యవేక్షణలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, హోటళ్లు, ఇతర వ్యాపారాల తీరుతెన్నులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు జరిగే ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
ఇళ్లల్లోనూ పెద్దయెత్తున సోదాలు
కొండాపూర్ లో ఉంటున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటిలో సోదాలు జరుగుతున్నాయి. వేకువజామునే పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్న అధికారులు… ఇంటి బయట కేంద్ర బలగాల్ని మోహరించి తనిఖీలు చేపడుతున్నారు. కొత్తపేటలో నివాసం ఉంటున్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు నడుస్తున్నాయి. అటు జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని జనార్దన్ రెడ్డి నివాసంతోపాటు కూకట్ పల్లిలోని ఆయన షాపింగ్ మాల్ లోనూ పెద్దయెత్తున సోదాలు జరుగుతున్నాయి. గత ఏడాది జరిపిన లావాదేవీలు, అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో ఈ సంస్థలు నిర్వహించిన వ్యాపారం, వచ్చిన ఆదాయం, చెల్లించిన పన్నుల వివరాల గురించి ఆరా తీస్తున్నారు.