తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న ఛార్జీలే ఇప్పటికీ ఉన్నాయని, వాటిని వెంటనే పెంచకపోతే ప్రైవేటు రవాణా రంగం స్తంభించేలా పిలుపునిస్తామని ఆటో మోటార్ ట్రాన్స్ పోర్ట్ JAC ప్రకటించింది. తమ సమస్యల్ని పరిష్కరించలేని పక్షంలో నిరసనల్ని కొనసాగిస్తామని హెచ్చరించింది. హైదరాబాద్ లోని INTUC స్టేట్ ఆఫీసులో మీట్ అయిన JACలోని సంఘాలు.. కార్మికులు పడుతున్న కష్టాల గురించి చర్చించాయి. రవాణా రంగ కార్మికుల కోసం ఇప్పటికైనా ఉద్యమం చేపట్టాలని తీర్మానించాయి. ఆటో కార్మికుల సమస్యలు తీర్చిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని ప్రకటించాయి. హైదరాబాద్ మహానగరంలోనే లక్ష ఆటోలు తిరుగుతుండగా.. రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్య పెద్దయెత్తున ఉంటోంది.
ఎప్పుడో 12 ఏళ్ల క్రితం ఆటోల ఛార్జీలు సవరించగా.. ఇప్పటిదాకా వాటి జోలికే పోలేదు. ఆటోమీటరు ఛార్జీలు వెంటనే పెంచితేనే కష్టాల కడలి నుంచి కార్మికులు బయటపడతారు. ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్లలో ఎక్కువమంది అద్దె లెక్కన పనిచేస్తూ బతుకుతున్నారు. రోజూ వచ్చే ఆదాయంలో ఫ్యూయల్ కు, యజమానికి ఇచ్చేయగా మిగిలింది అరకొర ఉంటుందని ఆవేదనతో ఉన్నారు. ఛార్జీలు పెంచకపోతే త్వరలోనే ఆటోల బంద్ కు పిలుపునిస్తామని తెలంగాణ ఆటో డ్రైవర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ A.సత్తిరెడ్డి అన్నారు. ఈ JAC మీటింగ్ లో BRTU స్టేట్ ప్రెసిడెంట్ వేముల మారయ్య, AITU స్టేట్ జనరల్ సెక్రటరీ B.వెంకటేశం, IFTU స్టేట్ ప్రెసిడెంట్ V.కిరణ్, INTUC స్టేట్ లీడర్ మల్లేశ్ గౌడ్ పాల్గొన్నారు. ప్రైవేటు రవాణా రంగంలో ఆటోలు, క్యాబ్ లు, లారీల వంటి వాహనాలు లక్షలాదిగా ఉన్నాయి.
ఆటోల రేట్స్, డిమాండ్స్ ఇలా…
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆటోల మినిమమ్ రేట్ రూ.20గా ఉండగా… ప్రతి కిలోమీటర్ కు రూ.11 చొప్పున అడిషనల్ గా ఇస్తున్నారు. ఇప్పుడు దీని మినిమమ్ ఛార్జీ రూ.40గా, ప్రతి కిలోమీటర్ కు రూ.20 చొప్పున పెంచాలని ఎంతకాలంగానో సంఘాలు కోరుతున్నాయి. ఆటోలను ఈజీగా కొనుక్కునేందుకు వీలుగా ఆటో పర్మిట్ లు ఓపెన్ చేయాలని… ప్రస్తుతం బ్లాక్ మార్కెట్ బాగా నడవడం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని… స్క్రాప్ కింద పాత ఆటోను ఇస్తేనే కొత్త ఆటో కొనుగోలుకు పర్మిషన్ ఉండటం అవినీతికి అడ్డాగా మారిందని ఆటోల సంఘం తెలిపింది. ఇన్సూరెన్స్ రేట్స్ తగ్గించడం… యాక్సిడెంట్లలోనే కాకుండా సహజ మరణాలకూ ఇన్సురెన్స్ ఇవ్వడం… వయసు పైబడ్డ వారికి పెన్షన్… కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఇందుకోసం హైదరాబాద్ లో భారీ బహిరంగసభ నిర్వహించడంతోపాటు జిల్లాల్లోని యూనియన్లు మీటింగ్ లు పెట్టుకునేలా చూడాలని లీడర్లు నిర్ణయించారు.