రవాణా రంగంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించేలా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని రవాణా రంగ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) కోరింది. కాంగ్రెస్ పార్టీ MLA సీతక్కను కలిసిన ఆ సంఘ నాయకులు.. ఆమెకు వినతిపత్రాన్ని అందజేశారు. ఇన్సూరెన్స్ రేట్లు తగ్గించడం… యాక్సిడెంట్లలోనే కాకుండా సహజ మరణాలకూ ఇన్సూరెన్స్ వచ్చేలా చేయాలని JAC కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నది. వయసు పైబడి పనిచేయలేని డ్రైవర్లు, ఇతర కార్మికులకు పెన్షన్లు అందించాలని కోరుతున్నది.
మరోవైపు అద్దె వాహనాలు నడుపుకొంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వం దృష్టిపెట్టేందుకు శాసనసభలో ఈ అంశాల గురించి మాట్లాడాలని సీతక్కను JAC నాయకులు కోరారు.
పేదలందరికీ ఇస్తున్న మాదిరిగానే రవాణా రంగంలోని కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసేలా చూడాలని అభ్యర్థించారు. నాయకుల వినతికి స్పందించిన సీతక్క.. ఈ సమావేశాల్లోనే వాటిని ప్రస్తావిస్తానని వారికి భరోసానిచ్చారు. సీతక్కను కలిసిన వారిలో JAC కన్వీనర్ దయానంద్, కో కన్వీనర్లు ఎ.మల్లేశ్, బి.రామకృష్ణారెడ్డి, ఆర్.మల్లేశ్ గౌడ్, ఎండి.ముక్తార్ పాషా, పి.సత్యనారాయణతోపాటు పలువురు డ్రైవర్లు ఉన్నారు.