Published 15 Dec 2023
DSPగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నళినికి ఎందుకు ఉద్యోగమివ్వకూడదో చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారు. మాజీ DSPకి అదే ఉద్యోగం ఇవ్వడంలో తప్పేంటి అని పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. పోలీసు శాఖపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ఈ మాజీ అధికారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి నళిని.. ఆమెకు అదే జాబ్ ను ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి.. ఆమెకు ఉద్యోగంపై ఇంట్రస్ట్ ఉంటే తిరిగి మళ్లీ డ్యూటీలోకి తీసుకోవాలి.. పోలీస్ శాఖలో ఏవైనా నిబంధనలు అడ్డుగా ఉంటే వేరే ఉద్యోగం ఇవ్వాలి.. నళినికి అదే హోదాలో ఇతర డిపార్ట్ మెంట్ లో జాబ్ ఇవ్వాలి’ అంటూ రేవంత్ ఆమె గురించి ప్రస్తావన తీసుకువచ్చారు.
రూల్స్ విషయంలో తేడాలా
ఉద్యోగం వదిలిపెట్టి మరీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా తిరిగి జాబ్ లో చేరుతున్నప్పుడు ప్రజాప్రయోజనమైన తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన నళిని చేసిన తప్పేంటి అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఈ విషయంపై సునిశిత ఆలోచన చేయాలని పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.