‘కాళేశ్వరం’ ప్రాజెక్టుల్లో అవకవతకలు జరిగాయని ప్రకటించిన ప్రభుత్వం న్యాయ విచారణ చేయిస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పిన మేరకు జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి(Retired Judge), మాజీ లోక్ పాల్ అయిన జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరగనుంది. ఈ విచారణను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
విచారణ ఇలా…
అవినీతితోపాటు అక్రమంగా నిధుల్ని పక్కదారి పట్టించడం, నిర్మాణంలో చోటుచేసుకున్న లోపాలపై సుప్రీం మాజీ జడ్జి చేత విచారణ చేయించాలని కేబినెట్ తీర్మానించింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు, కుంగిపోవడం వంటి ఘటనలపై విజిలెన్స్ ఎంక్వయిరీ నడిచిన సంగతి తెలిసిందే. దీన్ని మరింత లోతుగా తీసుకెళ్లే లక్ష్యంలో భాగంగా జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
విద్యుత్తు రంగంపైనా..
భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి విద్యుత్కేంద్రం ప్రాజెక్టులపై రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఛైర్మన్ గా విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఛత్తీస్ గఢ్ నుంచి కొన్న 1,000 మెగావాట్ల కరెంటును ఓపెన్ టెండర్ కాకుండా నామినేట్ సిస్టమ్ ద్వారా చేపట్టి ఆ డబ్బును దళారులకు అప్పటి ప్రభుత్వం అందజేసిందని చెప్పిన మంత్రి పొంగులేటి.. వీటన్నింటినిపైనా ఎల్.నర్సింహారెడ్డి కమిటీ విచారణ చేస్తుందన్నారు. ఈ కమిటీ సైతం 100 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని సూచిస్తున్నట్లు కేబినెట్ తీర్మానించింది.