
‘స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా’… ‘ఒక్కరా ఇద్దరా’… ‘పాటే నా ప్రాణము.. పాటే నా జీవితము’ అంటూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్.. తెలంగాణ సాహిత్యంలో అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో అందించిన విశేష కృషికి గాను 2023 కాళోజీ అవార్డును ఆయనకు ప్రకటించారు. కమిటీ సిఫారసుల మేరకు ముఖ్యమంత్రి KCR.. ఈ అవార్డుకు జయరాజ్ ను ఎంపిక చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాటల పూదోటగా మారి జయరాజ్.. ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఆయన… చిన్నప్పటినుంచే కష్టాలను దాటుకుని కవిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఊరూరా తిరిగి జనాల్ని చైతన్యవంతుల్ని చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ పాటల పరంగా ఆయనకు చనువు ఉంది.
స్నేహం విలువ చాటుతూ.. ఉద్యమంలో ఉన్నది ఒక్కరో ఇద్దరో కాదంటూ.. తెలంగాణ పల్లెల్లో ప్రతిధ్వనించే పలుకులకు అక్షర రూపమిచ్చిన జయరాజ్.. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మరోవైపు ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుకుంటూ ఆ ప్రకృతిపై ఆధారపడ్డ జీవరాశుల స్థితిగతులను గుర్తు చేస్తూ పుస్తకం తయారు చేశారు. ఈ నెల 9న కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో జయరాజ్ కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అవార్డు కింద రూ.1,01,116 నగదుతోపాటు జ్ఞాపికను బహూకరిస్తారు.