తెలంగాణ కోసం పోరాటం చేసిన ఏకైక పార్టీ BRS అని.. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు(Double Bedroom Houses) కట్టిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. 1956లో జరిగిన పొరపాటు వల్ల 58 ఏళ్ల పాటు తెలంగాణ అవస్థలు పడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. మేడ్చల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నాటి రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని అడుగడుగునా వివక్షకు గురయ్యామన్నారు.
నాటి CM కామెంట్స్ పై నోరుమెదపలేదు
తెలంగాణకు ఒక్క రూపాయీ ఇవ్వను అంటూ ఆనాటి CM కిరణ్ కుమార్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడినా ఒక్క కాంగ్రెస్ నాయకుడు నోరెత్తలేదని నాటి రోజుల్ని గుర్తు చేస్తూ KCR విమర్శించారు. మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్ ఒక మినీ భారతదేశమని, ఎంతో మంది ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని ఇక్కడకు వస్తున్నారన్నారు. హైదరాబాద్ కు వచ్చేవారు శాశ్వతంగా ఇక్కడే ఉండాలనుకుంటున్నారని, అలాంటి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని CM హామీ ఇచ్చారు.