తాము పడే కన్నీళ్ల ముందు వర్షపు నీళ్లు ఎంత అని అనుకున్నారో ఏమో.. భుజాన చంటి పిల్లలు.. నిరంతరాయ వర్షంలోనూ రెయిన్ కోట్లు, గొడుగులే ఆధారంగా గంటల తరబడి నిరసన. ఇంతకన్నా చెప్పేదేముుంటుంది.. KGBV, URS, SS సిబ్బంది ముట్టడి గురించి. జిల్లాల నుంచి తరలివచ్చిన మూడు విభాగాల సిబ్బంది.. హైదరాబాద్ వర్షాల్లో పడ్డ కష్టాలివి. కనీస వేతనానికి కూడా నోచుకోలేకపోతున్నామంటూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని SPD ఆఫీసును ముట్టడించారు.
ఎడతెరిపి లేని వర్షంలోనూ వందలాదిగా తరలివచ్చిన మహిళా ఉద్యోగులు.. నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా SPD గేటు వద్దకు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TSUTF) ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో సిబ్బంది తరలివచ్చారు. KGBVలతోపాటు URS(అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్), SS(సమగ్ర శిక్షా) విభాగాల సిబ్బంది ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. మూడు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులతో శ్రమ దోపిడీ చేయిస్తూ కనీస జీతాలు ఇవ్వడం లేదని, చివరకు వీక్లీ ఆఫ్(weekly off) కూడా ఇవ్వకుండా మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు CM కేసీఆర్ తమ సమస్యలపై ఇకనైనా దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. జులై 20న SPD ముట్టడి చేపట్టాలని గతంలోనే TSUTF నిర్ణయించింది. కానీ అకాల వర్షాలతో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆలోచన కనపడ్డా.. ఈ మూడు డిపార్ట్ మెంట్ల సిబ్బంది ఏ మాత్రం తగ్గలేదు. ఇచ్చిన మాట మేరకు 33 జిల్లాల నుంచి ఉద్యోగులు తరలివచ్చారు. ఇందులో మహిళా సిబ్బందే భారీ సంఖ్యలో ఉండటంతో TSUTF చేపట్టిన ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని ఆ సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇక సమస్యలు తీర్చే వరకు విశ్రమించేది లేదని, మరిన్ని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందంటూ పిలుపునిచ్చారు. నిరసనకారుల్ని కట్టడి చేయడానికి భారీగా పోలీసుల్ని మోహరించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో TSUTF నాయకులు.. CS శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో TSUTF నాయకులు జంగయ్య, చావ రవి, దుర్గా భవాని, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.