సోదరి అరెస్టుతో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కవితను అరెస్టు చేసిన తర్వాత కూడా బంజారాహిల్స్ లోని ఇంట్లోకి రానీయకపోవడంపై ED అధికారుల మీద మండిపడ్డారు. MLCని అరెస్టు చేస్తున్నట్లు ఆమె భర్త అనిల్ కు సమాచారమిచ్చిన ED టీమ్… ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ రాత్రి 8:45 గంటలకు ఢిల్లీ తరలిస్తున్నట్లు సమాచారమిచ్చారు. సాయంత్రం కవితను అదుపులోకి తీసుకుంటున్నట్లు వార్తలు రావడంతో KTRతోపాటు హరీశ్ రావు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
అధికారులతో వాగ్వాదం…
సోదాల తర్వాత కవితను అరెస్టు చేసిన ఘటనపై KTR… ఈడీ టీమ్ లోని మహిళా అధికారితో వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించారు. అరెస్టు చేయబోమంటూ సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాటను ఎలా తప్పుతారంటూ నిలదీశారు. కవిత కేసు విషయంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని గుర్తు చేసిన KTR.. అరెస్టు చేసి తప్పు చేస్తున్నారని అన్నారు.
శుక్రవారం లాజిక్…
కావాలనే అరెస్టు చేసేందుకు ED అధికారులు శుక్రవారం నాడు వచ్చారంటూ కవిత సోదరుడు KTR అన్నారు. శుక్రవారం నాడు అరెస్టు చేస్తే శని, ఆదివారాల్లో ఆమె బయటకు వచ్చే వీలుండదు కాబట్టి కావాలనే అధికారులు శుక్రవారాన్ని ఎంచుకున్నారు. వాస్తవానికి ఏ ముఖ్యమైన అరెస్టులున్నా ఇదే రీతిగా చేస్తుంటారు. రాత్రి 7:15 గంటలకు కవితను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. అధికారుల్ని అడ్డుకునేందుకు పార్టీ కార్యకర్తలు వాహనాలకు అడ్డం పడ్డారు. అయితే అప్పటికే భారీగా మోహరించిన బలగాలు.. నాయకులు, కార్యకర్తల్ని పక్కకు పంపించాయి.