ఫార్ములా ఈ-రేస్ కు సంబంధించి KTRపై నమోదైన కేసులో హైకోర్టులో పోటాపోటీ వాదనలు నడిచాయి. ACB నమోదు చేసిన సెక్షన్లు దీనికి వర్తించవు అంటూ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవే KTR తరఫున వాదనలు వినిపించారు. ఫార్ములా వ్యవహారాలకు సంబంధించి పూర్తి బాధ్యత పురపాలక శాఖదే కాబట్టి మంత్రికి వర్తించబోదని వాదించారు. అయితే విదేశీ కరెన్సీ అయిన బ్రిటన్ పౌండ్స్ రూపంలో డబ్బులు చెల్లించడం ద్వారా RBI నిబంధనల్ని పట్టించుకోలేదని, తద్వారా రిజర్వ్ బ్యాంకు రూ.8 కోట్ల మేర ఫైన్ వేసిందని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. KTRతోపాటు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇష్టారీతన నిర్ణయాలు తీసుకున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరిగిందని తెలిపారు.
అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్లు పెట్టినట్లు ACB తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే కొత్తగా తెచ్చిన BNS చట్టం కాకుండా IPC సెక్షన్లు ఎందుకు పెట్టారని కోర్టు ప్రశ్నించింది. ఆయా వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ KTR క్వాష్ పిటిషన్ వేయగా.. ఆయనకు హైకోర్టు ఇచ్చిన ‘నాట్ టు అరెస్ట్’ గడువు ఈరోజు(డిసెంబరు 31)తో ముగిసిపోతుంది.