నోటీసులకు స్పందించి విచారణ కోసం వచ్చిన మాజీ మంత్రి KTR.. ACB కార్యాలయం వద్దే సంచలన నిర్ణయం తీసుకున్నారు. విచారణకు హాజరు కాకుండానే అక్కణ్నుంచి వెనుదిరగాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. KTR ఆకస్మిక నిర్ణయానికి ప్రధాన కారణం.. విచారణకు తన న్యాయవాదుల్ని అనుమతించకపోవడమే. ఫార్మలా ఈ-కార్ రేస్ కేసులో ACB ఇచ్చిన నోటీసులపై నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి వెళ్లారు. కానీ అక్కడి పరిస్థితుల్ని చూశాక ఇక విచారణకు హాజరు కావొద్దని భావించి వెంటనే అక్కణ్నుంచి బయల్దేరి వెళ్లిపోయారు.
విచారణకు లాయర్లను అనుమతించాలని పట్టుబట్టిన మాజీ మంత్రి.. న్యాయవాదులతో వస్తే ఇబ్బందేంటంటే అధికారుల్ని నిలదీశారు. కానీ లాయర్లను అనుమతించాలని కోర్టు ఆర్డర్స్ లో ఎక్కడా లేదని అధికారులు బదులివ్వడంతో ఇలా 45 నిమిషాల పాటు ACB ఆఫీసు వద్ద హైడ్రామా ఏర్పడింది. తనను ఇరికించడానికి ఆడుతున్న డ్రామాలే అంటూ KTR అక్కణ్నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.