వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణను నిరసిస్తూ రైతులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీయగా అందులో పలువుర్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కొద్దిరోజులుగా కారాగారంలోనే ఉన్న రైతులకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. 24 మంది రైతులకు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్న కేసులో కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి A1గా ఉన్నారు. నరేందర్ రూ.50 వేలు, మిగతావారు రూ.20 వేల చొప్పున పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నిందితులను కస్టడీలోకి తీసుకుని ఇప్పటికే ప్రశ్నించగా.. ఈరోజు వాదనలు సాగాయి. అవసరమైన సమయంలో పోలీసులకు సహకరించాలంటూనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది.