టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET)కు దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడం విశేషంగా మారింది. మే 20 నుంచి మొదలయ్యే పరీక్షల(Exams)కు ఈ రోజు సాయంత్రం వరకు గడువుంది. అయితే నిన్నటి(ఏప్రిల్ 9) వరకు 1.93 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇక ఒక్కరోజే మిగిలి ఉండటంతో అప్లికేషన్ల సంఖ్య 2 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.
గత ‘టెట్’లో…
2023 సెప్టెంబరులో నిర్వహించిన ‘టెట్’కు 2.91 లక్షల మంది అప్లయ్ చేసుకున్నారు. ఇన్ సర్వీస్ టీచర్ల ప్రమోషన్ల కోసం ‘టెట్’ తప్పనిసరి(Mandatory) కావడంతో ఈసారి వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయినా గత ‘టెట్’ కన్నా ఈసారి భారీగా అప్లికేషన్లు తగ్గిపోయాయి. DSCలో ‘టెట్’కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. కొత్తగా బీఈడీ, డీఈడీ పాసయిన అభ్యర్థులు సహా గతంలో ‘టెట్’ పాసయిన వారు మార్కులు పెంచుకునేందుకు ఈ పరీక్షను రాస్తుంటారు.
పెరిగిన ఫీజు…
రెండు పేపర్లు రాసినా ఫీజు గతేడాది వరకు రూ.400 మాత్రమే ఉండగా, ఈసారి ఒక్కో పేపర్ కు రూ.1,000కి పెంచారు. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా విద్యాశాఖ తగ్గలేదు. ఈసారి పోస్టుల సంఖ్య(11,062) పెరిగినందున అప్లికేషన్లు కూడా పెద్దయెత్తున వస్తాయని భావించినా అది జరగలేదు.