శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) సొరంగంలో చిక్కుకున్నవారిని ఆదుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సొరంగాన్ని తవ్వే ‘టన్నెల్ బోరింగ్ మిషిన్’ ముందు భాగంలో ఎనిమిది మంది ఇరుక్కుపోయారు. చుట్టూ నీరు, బురద(Mud) భారీగా పేరుకుపోవడంతో ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందుకోసం లేటెస్ట్ టెక్నాలజీగా పిలిచే ‘ఫ్లెక్సీ ప్రోబ్’ అనే కెమెరాల్ని లోపలికి పంపుతున్నారు. మనుషులు వెళ్లలేని ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించేందుకు ‘ఫ్లెక్సీ ప్రోబ్’ కెమెరా పనిచేస్తుంది. గతంలో వివిధ రాష్ట్రాల్లో విపత్తులు సంభవించిన సందర్భాల్లో వీటిని ఉపయోగించారు. 12 మీటర్ల పొడవు గల టన్నెల్ మిషిన్ ఇప్పటికే రెండు ముక్కలై ఒక భాగం దూరంగా కొట్టుకుపోయింది. సొరంగంలో 2 కిలోమీటర్ల మేర నీరు నిలవడంతో బాధితులు చిక్కుకున్న ముందు భాగంలోకి వెళ్లడం కష్టంగా మారింది.