రాష్ట్రంలోని 1,022 గురుకులాల్లో 30 వేల మంది సిబ్బంది, 6 లక్షల మంది విద్యార్థులుంటున్నా.. పనివేళలు, మౌలిక సదుపాయాలు లేవంటూ ఈ నెల 28న మహాధర్నాకు సంఘాలు సిద్ధమయ్యాయి. గురుకుల సంఘాల JAC, UTF ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)కి ఇవాళ నోటీసులు ఇవ్వనున్న సంఘాలు.. ఈ నెల 18, 19 తేదీల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని ప్రకటించాయి. ఈ నెల 22, 23 తేదీల్లో కలెక్టర్లు, MLAలకు వినతిపత్రాలు అందజేయనున్నాయి.
5 డిపార్ట్మెంట్లు, 6 సొసైటీల కింద నడుస్తున్న గురుకులాల్లో నాణ్యమైన విద్య అనేది మాయ అని, 8 సంవత్సరాల నాటి మెస్ ఛార్జీలే ఇంకా కంటిన్యూ అవుతుండటం.. మంచాలు, డ్యూయల్ డే స్కూల్ వంటి కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని సంఘాలు అంటున్నాయి. మొత్తం 24 డిమాండ్లపై పూర్తి స్థాయి చర్చ జరపాలంటూ అన్ని విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఇప్పటికే నోటీసులు అందించారు. ఈ దశలవారీ ఉద్యమంతోనైనా గురుకులాల్లో పరిస్థితి మారుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు UTF అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, గురుకుల JAC అధ్యక్షుడు మామిడి నారాయణ అన్నారు.