రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన కాళేశ్వరం(Kaleshwaram)లోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై కేంద్రం ‘అల్టిమేటం’ జారీ చేసింది. కోరిన సమాచారాన్ని(Information) ఇవ్వాలని కోరుతూ రాష్ట్రానికి కేంద్రం అల్టిమేటం(Ultimatum) ఇచ్చింది. ఆదివారం లోగా వివరాలు ఇవ్వాలని కోరుతూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. ఈ నెల 23 నుంచి 26 వరకు మేడిగడ్డ ప్రాజెక్టును కేంద్ర కమిటీ సందర్శించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 20 అంశాలపై వివరణ కోరితే కేవలం మూడింటికి మాత్రమే జవాబు ఇచ్చారని కేంద్ర జల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రేపటిలోగా అన్ని డీటెయిల్స్ అందజేయాలని స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లెటర్ పంపింది.
ఇదీ జరిగింది…!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఒక్కసారిగా కుంగిపోయింది. భారీ శబ్దంతో బీ బ్లాకులో గల వంతెన ప్రమాదానికి గురైంది. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు కాగా.. ఘటన చోటుచేసుకున్న ప్లేస్ మహారాష్ట్ర పరిధికి కేవలం 356 మీటర్ల దూరంలో ఉండటం సంచలనంగా మారింది. దీంతో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు అలర్ట్ ప్రకటించి.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఈ డ్యామ్ పై నుంచి రాకపోకలు నిలిపివేశారు. జరిగిన ఘటనపై కారణాలు తెలుసుకునే దర్యాప్తులో భాగంగా కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది.