Published 06 DEC 2023
రాష్ట్రంలో రేపు కొలువుదీరబోయే ప్రభుత్వంలో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలన్న దానిపై ఢిల్లీ వేదికగా విస్తృత మంత్రాంగం నడుస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన తర్వాత అధిష్ఠానం(High Command) పిలుపు మేరకు నిన్న ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. అగ్ర నేతలందర్నీ కలుస్తున్నారు. CLP(కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ) సమావేశంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సీనియర్లకు ఎలాంటి శాఖలు కట్టబెట్టాలన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నాలుగైదు ప్రధాన శాఖలతోపాటు స్పీకర్ వంటి పదవిని అత్యంత సీనియర్లకే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు కొన్నింటిపై నిర్ణయం జరిగాకే రేవంత్ అభ్యర్థిత్వ ప్రకటన వెలువడ్డట్లు ప్రచారం జరిగింది. కాబట్టి ఇప్పుడు చేపట్టబోయే మంత్రివర్గ స్థానాల ఎంపికే తెలంగాణ కాంగ్రెస్ కు కీలకం కానుంది.
సీనియర్లే పెద్ద టాస్క్
ఈసారి జరిగిన ఎన్నికల్లో కొంతమందికి చుక్కెదురు కాగా చాలా మంది సీనియర్లు MLAలుగా గెలుపొందారు. ఉత్తమ్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం, దామోదర వంటి నేతలు మంత్రివర్గంపై కన్నేశారు. ఇందులో కొందరు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడటంతో ఆ స్థాయి పదవిని కట్టబెట్టాల్సి ఉంది. దీనిపై ఈ రోజంతా రేవంత్ ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. తొలుత మల్లికార్జున ఖర్గేను ఆ తర్వాత సోనియా, రాహుల్, ప్రియాంకతో.. కాబోయే సీఎం చర్చలు జరపనున్నారు. ఇలా సీనియర్లతోపాటు రాజకీయాల్లో తన వెంటే నడుస్తూ తనకు అండగా నిలుస్తున్న సీతక్క వంటి నేతల్నీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తమ్, భట్టి విక్రమార్కకు ఏ శాఖలు దక్కుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.
వివాదాలకు తావు లేకుండా
ఇపుడు చేపట్టబోయే మంత్రి వర్గ కూర్పు రాష్ట్ర పాలనకు అద్దం పట్టనుంది. గత పదేళ్లుగా ఒకటే శాఖల్ని నిర్వహిస్తున్న మంత్రులు BRSలో చాలా మంది ఉండేవారు. అలా ఆయా మంత్రిత్వ శాఖల్లో తీవ్ర అలసత్వం చోటుచేసుకుని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారులోనూ అదే తీరు కనిపిస్తే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నది సుస్పష్టం(Very Clarity). కాబట్టి రేవంత్ తోపాటు హైకమాండ్ తీసుకునే డిసిషన్స్ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా ఉంటేనే సరి.. లేదంటే మళ్లీ కుమ్ములాటలు జరిగే ప్రమాదం పొంచి ఉందన్న మాటలు వినపడుతున్నాయి.