
Published 29 Dec 2023
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించిన విధంగా మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు, నిర్మాణంపై అతి త్వరలోనే న్యాయ విచారణ(Judicial Enquiry) జరగబోతున్నట్లు స్పష్టమైంది. ఈ మేరకు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన మంత్రుల బృందం.. న్యాయ విచారణపై క్లారిటీ ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడమే కాదని, అన్నారం ప్రాజెక్టుకు కూడా ప్రమాదం పొంచి ఉందని మంత్రుల పరిశీలనలో వెల్లడైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కూడిన ఐదుగురు మంత్రుల టీమ్ మేడిగడ్డను పరిశీలించింది. గత ప్రభుత్వ తప్పిదం వల్ల మూడు బ్యారేజీలు ఖాళీ చేసి వాటన్నింటినీ బాగు చేయాలంటే మరింత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్న నిర్ణయానికి మంత్రుల బృందం వచ్చింది.
మరి ఇప్పుడెలా…
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తొలుత రూ.38,000 కోట్లు అంచనాలు రూపొందిస్తే.. కేంద్ర జల సంఘం(CWC) అప్రూవల్ మేరకు దాన్ని కేసీఆర్ ప్రభుత్వం రూ.80,000 కోట్లకు పెంచింది. అయినా 80 వేల కోట్లతోనే కట్టకుండా ప్రాజెక్టు నిర్మాణానికి లక్షన్నర(1.5 లక్షల) కోట్లు వెచ్చించినట్లు మంత్రులు తెలిపారు. రూ.95,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త ఆయకట్టు 97,000 ఎకరాలు మాత్రమేనని, CAG(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కూడా తీవ్రమైన హెచ్చరికలు చేసినట్లు గుర్తు చేశారు. అటు ప్రాజెక్టు నిర్వహణకే ఏటా ఖర్చుల రూపేణా రూ.13,000 కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు ఇంజినీర్లు వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులను ఖాళీ చేయడం ఒకెత్తయితే, వాటి మరమ్మతులకు వెచ్చించేది కూడా భారీగానే ఉంటుందన్న అంచనాకు వచ్చారు.