Published 26 Nov 2023
సర్కారీ బడుల్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందని, మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే అది సాధ్యపడుతుందని MLC అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ ఖాళీల్ని భర్తీ చేసి, పాఠశాలలకు నిధులు పెంచితేనే విద్యాలయాల మనుగడ ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TSUTF ఆధ్వర్యంలో జగిత్యాల టీచర్స్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన టీచర్ తిరుకోవెల వెంకటేశం కుటుంబానికి TSUTF నాయకులతో కలిసి రూ.6 లక్షల చెక్కును అందించారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లుల్ని వెంటనే మంజూరు చేయాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.
నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులతోపాటు ప్రతి పాఠశాలలో టీచర్లను నియమించి స్కూళ్లను కాపాడుకోకుంటే భవిష్యత్తు అంధకారమవుతుందని నర్సిరెడ్డి గుర్తు చేశారు. TSUTF రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, కుటుంబ సంక్షేమ నిధి కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరుకోవెల శ్యాం సుందర్, అంబటి భూమేశ్వర్, ఉపాధ్యక్షులు అయిటి సుశీల, టి.శ్రీనివాస్ తోపాటు మనుపాటి బన్న, కొంద్ర అనిల్, ఆగమయ్య, పి.వి.ప్రసాద్, శ్రీనివాసరావు, గడ్డల శ్రీధర్, MD ఖలీద్ పాషా, సిరిపురం శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.