వాస్తుని బాగా నమ్మే వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ మాజీ ముఖ్యమంత్రి(Former Chief Minister) ఏ పనిచేసినా వాస్తును చూసుకునే ఫాలో అవుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొన్నటివరకు పదేళ్ల పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ఆయన సర్కారుకు.. 2023 డిసెంబరులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అధికారం కోల్పోవడంతోపాటు తాను జారిపడి సర్జరీ జరగడం… కీలకమైన, సీనియర్ లీడర్లంతా పార్టీని విడిచిపెట్టడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి వాస్తుదోషంపై ఈ మాజీ CM దృష్టిపెట్టారు.
బీఆర్ఎస్ భవన్ కు…
తెలంగాణ భవన్ గా పిలుకుచునే BRS భవన్ ఉద్యమ కాలం నుంచి పార్టీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తూనే ఉంది. గత నాలుగు నెలలుగా జరుగుతున్న పరిణామాలతో తెలంగాణ భవన్ లో వాస్తు దోషం ఉందని కేసీఆర్ భావించారు. అందుకనుగుణంగా మార్పులు చేయాలని నిర్ణయించి పనులు కూడా మొదలు పెట్టారు. ప్రస్తుతం వాయువ్యం మూల(North-West) వైపు ఉన్న గేట్ ద్వారా రాకపోకలు సాగుతున్నాయి. అయితే దీనికి బదులుగా ఇకనుంచి ఈశాన్య మూల(North-Eastern) నుంచి వాహనాలు వెళ్లేలా ప్లాన్ చేశారు. అందుకోసం ప్రత్యేకంగా ర్యాంప్ కూడా నిర్మిస్తున్నారు.
రోడ్ నంబర్-12లో…
బంజారాహిల్స్ లోని రోడ్ నంబరు-12లో ఉంటుంది తెలంగాణ భవన్. దీని ముందు గల రోడ్డులో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈ భవనానికి వీధిపోటు ఉందని అధినేత భావించినట్లు తెలుస్తున్నది. వీధిపోటుతోపాటు ‘T’జంక్షన్(మూడు రోడ్ల కూడలి) వల్ల దోషం ఏర్పడిందన్న భావనతో మార్పులు చేస్తున్నారు. 119 స్థానాలు గల అసెంబ్లీలో 39 సీట్లు మాత్రమే గెలుచుకుంది BRS. లోక్ సభ ఎన్నికలకు 40 రోజులు ఉందనగానే కె.కేశవరావు, కడియం శ్రీహరి లాంటి సీనియర్లంతా పార్టీ విడిచి వెళ్లారు.
గతంలోనూ మార్పులు…
2014, 2017లోనూ తెలంగాణ భవన్ లో మార్పులు జరిగాయి. వాస్తు బాగా లేదని 2014లో లోపలి గోడలతోపాటు డోర్లను తొలగించారు. ఇక ఆ ఏడాదే తెలంగాణ ఏర్పడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి టాయిలెట్లు, కొన్ని రూముల్ని కూల్చేశారు. పదేళ్ల పాలనా కాలంలో సచివాలయాని(Secretariat)కి కొద్దిసార్లు మాత్రమే వెళ్లారు కేసీఆర్. పాత సచివాలయానికి వాస్తు దోషం ఉందని భావిస్తూ ప్రగతి భవన్ మాదిరిగా కొత్త భవనాన్ని రూ.1,000 కోట్లతో నిర్మించారు. అయితే అధికారం కోల్పోగానే ఫామ్ హౌజ్ లో కాలు జారి పడి తుంటి ఎముకకు సర్జరీ చేయించుకున్న కేసీఆర్.. CM పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఒకేసారి తెలంగాణ భవన్ కు వెళ్లారు.