సినీనటుడు మోహన్ బాబు పిటిషన్ పై హైకోర్టులో విచారణ(Hearing) జరిగింది. పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి విచారణకు స్వీకరించారు. మూడు రోజులుగా ఈ సినీ నటుడి కుటుంబంలో గొడవలు జరుగుతున్న దృష్ట్యా.. మోహన్ బాబుతోపాటు ఆయన తనయులు విష్ణు, మనోజ్ ను విచారణకు రావాల్సిందిగా రాచకొండ పోలీస్ కమిషనర్ నోటీసులు పంపించారు. విచారణకు హాజరవుతామని విష్ణు, మనోజ్ ఇప్పటికే ప్రకటించగా.. మోహన్ బాబు మాత్రం అందుకు ససేమిరా అన్నారు. గచ్చిబౌలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన.. హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ నెల 24 వరకు ఆయనకు మినహాయింపునిచ్చేలా స్టే విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది.