గతంలో ఎన్నడూ లేని విధంగా తమ సామాజికవర్గానికి మంత్రివర్గం(Cabinet)లో చోటు దక్కలేదని మున్నూరు కాపు నేతలు అసంతృప్తి చెందారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు నివాసంలో భేటీ అయిన లీడర్లు.. వివిధ అంశాలపై చర్చించారు. కులగణనపై కృతజ్ఞతగా సభ పెడదామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచన చేస్తే.. సర్వేలో తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారన్న వాదనను కొందరు తెరపైకి తెచ్చారు. BJP, BRS పార్టీల్లో దక్కిన ప్రాధాన్యత కాంగ్రెస్ లో కరవైందని మరికొందరు అభిప్రాయపడ్డారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం ఇదే తొలిసారి అని గుర్తు చేసుకున్నారు. డి.శ్రీనివాస్, కేకే, వీహెచ్, పొన్నాలకు దక్కిన స్థాయి నేడు ఎవరికీ లేకుండా పోయిందన్న ఆవేదన కనపడింది.
‘మన మీద కుట్రలే కాదు.. దాడి చేసినంతగా ఓ సామాజికవర్గం పనిచేస్తోంది.. మన ప్రాధాన్యత తగ్గిస్తే మనం కూడా అలాగే ఉందాం.. నామినేటెడ్ పోస్టుల్లోనూ అన్యాయం జరుగుతోంది.. మనల్ని అసలు లెక్కలోకి తీసుకోవడం లేదు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత అవసరాన్ని గుర్తించి మనకు రెండుసార్లు మంత్రివర్గంలో కేసీఆర్ స్థానం కల్పించారు.. MP, MLA, MLCలతోపాటు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టారు.. కృతజ్ఞత సభకు బదులు బహిరంగ సభ నిర్వహిద్దాం..’ ఇలా మున్నూరు కాపు నేతలు పలు రకాలుగా అభిప్రాయపడ్డారు.