
వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించలేని పరిస్థితి నెలకొన్న ఇద్దరు సీనియర్ నేతలకు కార్పొరేషన్ పదవుల్ని ప్రభుత్వం కట్టబెట్టింది. జనగామ MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆర్టీసీ ఛైర్మన్ గా నియమించగా… మరో MLA తాటికొండ రాజయ్యకు రైతు బంధు సమితి అధ్యక్ష పదవిని అప్పగించారు. ఈ మధ్యే పార్టీలో చేరిన నందికంటి శ్రీధర్ ను ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ గా సర్కారు నియమించింది. మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ గా ఉప్పల వెంకటేశ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అనుకున్నట్లుగానే పదవుల కేటాయింపు
జనగామ, స్టేషన్ ఘన్ పూర్ లో సీట్లు కేటాయించలేని పరిస్థితి నెలకొన్న దృష్ట్యా సిట్టింగ్ ఎమ్మెల్యేలైన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టి.రాజయ్యకు కీలక పదవులు కట్టబెడతారన్న ప్రచారం జరిగింది. ఈ ఇద్దరికీ ఆర్టీసీ, రైతు బంధు సమితి అప్పగిస్తారని ముందునుంచీ ప్రచారం సాగింది. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలోకి దిగనుండగా.. స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు. ముందునుంచీ ఉప్పు, నిప్పులా ఉన్న రాజయ్య, శ్రీహరిని ఈ మధ్యనే హైదరాబాద్ పిలిపించుకున్న కేటీఆర్.. ఇద్దరినీ మళ్లీ కలిపారు. అప్పట్నుంచి వీరిద్దరికీ త్వరలోనే కీలక పదవులు దక్కుతాయని పార్టీలో జోరుగా ప్రచారం నడుస్తున్న వేళ.. ప్రభుత్వం అనుకున్నట్లుగా యాదగిరిరెడ్డి, రాజయ్యలకు పదవులు కట్టబెట్టింది.