Published 19 Nov 2023
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు… ఉద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తిగా, పార్లమెంటు సభ్యుడిగా, ముఖ్యమంత్రి(Chief Minister)గా గత 20 ఏళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2004లో MPగా ఎన్నికైనప్పటి నుంచి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లలో పార్టీ ఓడిపోయే వరకు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో కేసీఆర్ ఉండేవారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వం పడిపోయిన తర్వాత హస్తినలోని ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. రెండు దశాబ్దాలుగా తుగ్లక్ రోడ్డులోని 23వ నెంబరు బంగ్లాను అధికార నివాసంగా మార్చుకున్న KCR.. ఇప్పుడా ఆ బంగ్లాను ఖాళీ చేశారు. ఆయన వ్యక్తిగత వస్తువులు, ఇతర సామగ్రిని అక్కడి సిబ్బంది మరో చోటుకు తరలించారు.
రేవంత్ పేరుతో బోర్డు
2004 నుంచి 2014 వరకు తుగ్లక్ రోడ్డు నుంచే కేసీఆర్ MPగా కార్యకలాపాలు కొనసాగించగా.. 2014లో కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటిదాకా అదే ఇంటిని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించుకున్నారు. ఈ నెల తొలి వారం దాకా అదే ఇంటిని కంటిన్యూ చేసినా ఎన్నికల ఫలితాల అనంతరం ఆ బంగ్లాను ఖాళీ చేసి తెలంగాణ భవన్ అధికారులకు అప్పగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ రోజు తొలిసారిగా ఆ బంగ్లాను సందర్శించారు. అక్కడే తెలంగాణ భవన్ అధికారులతో సమావేశం నిర్వహించి… రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ అంశాలపై చర్చించారు. ఇప్పటిదాకా రేవంత్.. MS ఫ్లాట్స్ యమున అపార్ట్ మెంట్లోని 902 ఫ్లాట్ లో ఉండేవారు. దీంతో 20 ఏళ్ల పాటు కేసీఆర్ కు సేవలందించిన భవనం ఇప్పుడు మరో ముఖ్యమంత్రికి నివాసంగా మారింది.