రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ(Cabinet) ఉపసంఘం(Sub-Committee) తొలి సమావేశంలో పలు ప్రతిపాదనలు వచ్చాయి. పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మరో ఇద్దరు సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రతిపాదనలను పరిశీలించారు.
ఇలా ఉంటేనే…
కొత్త కార్డుల మంజూరీపై కేబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘంగా 5 గంటల పాటు చర్చించింది. లబ్ధిదారుల(Beneficieries) ఎంపికపై పలు ప్రతిపాదనలు కమిటీ ముందుకు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం లక్షన్నర రూపాయల లోపు ఉండి మూడున్నర ఎకరాల మాగాణి.. ఏడున్నర ఎకరాల చెలక ఉండాలి.
పట్టణ ప్రాంతాల్లో…
పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రెండు లక్షల రూపాయలకు మించకూడదు. పట్టణాల్లో భూమి కాకుండా సంవత్సర ఆదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్న సూచన వచ్చింది. అయితే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారెవరూ కార్డు కోల్పోకుండా చూసేలా లోతైన అధ్యయనం చేయాలన్న నిర్ణయానికి కమిటీ వచ్చింది.
రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్ ఉత్తమ్ తెలిపారు. MPలు, MLAలకు లెటర్లు రాసి సూచనలు తీసుకోవాలని, 2 రాష్ట్రాల్లో కార్డులున్నవారికి ఆప్షన్ ఇవ్వాలన్న ఆలోచన చేశారు.