
తెలంగాణ బీజేపీకి కొత్త టీమ్ వచ్చేసింది. పార్టీ ప్రెసిడెంట్, ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీలకు సీనియర్లు నియామకమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి మరోసారి నియమితులయ్యారు. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు కట్టబెడుతూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. 2010-14 మధ్య ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డి… 2014-16 మధ్య కాలంలో స్టేట్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చూశారు. 2016-18 మధ్య రాష్ట్ర శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. 2019లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. అటు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరి బాధ్యతలు చేపడతారు.

కొత్త టీమ్ ల ద్వారానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్లాలని హైకమాండ్ నిర్ణయించింది. కిషన్ రెడ్డి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన అధిష్టానం.. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల్ని పరిగణలోకి తీసుకుంది. వీరితోపాటు మరో రెండు రాష్ట్రాలకూ కొత్త ప్రెసిడెంట్ లు ఎంపికయ్యారు. పంజాబ్ స్టేట్ ప్రెసిడెంట్ గా సునీల్ జాఖడ్… ఝార్ఖండ్ అధ్యక్షుడిగా బాబూలాల్ మరాండిని నియమించారు. అటు ఈ మధ్యే పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ప్రకటించారు.