
Published 29 Nov 2023
ఎన్నికల సంఘం ఎంత గట్టిగా చెబుతున్నా ప్రైవేటు సంస్థలు, కంపెనీలు కళ్లు తెరవటం లేదు. తమ ఒంటెద్దు పోకడలతో ప్రజాస్వామ్యాన్నే పెద్దగా పట్టించుకోవడం లేదు. వాస్తవానికి పోలింగ్ నాడు అందరూ ఓటు వేసే విధంగా ప్రతి ఉద్యోగికి ఆ రోజు సెలవు ఇవ్వాలి. అది కూడా పేమెంట్ తో కూడిన హాలిడే(HOP) ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై కొన్ని రోజుల ముందు నుంచే EC స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. హాలిడే ఇవ్వని కంపెనీలు(Companies), సంస్థల(Organizations)పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది మాత్రం అందుకు పూర్తి భిన్నం. అందరికీ సెలవులు ఇస్తే ఆ రోజు కంపెనీలు ఎలా నడుస్తాయంటూ చాలా చోట్ల HODలు బెదిరిస్తుంటారు. ఇప్పుడు దీనిపైనే పెద్ద చర్చ జరుగుతున్నది. మీరు చెప్పినట్లు మాకు సెలవు ఇవ్వట్లేదని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేకపోతున్నామంటూ చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. 1950 టోల్ ఫ్రీ నంబరుకు పెద్దయెత్తున కంప్లయింట్స్ రావడంతో ఆ దిశగా ఎలక్షన్ కమిషన్ దృష్టిసారించింది.
డ్యూటీయే ముఖ్యం.. ఓటెందుకు..
సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఇతర సంస్థలు.. తమ ఉద్యోగులు ఓటు వేయడాన్ని పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. అంతెందుకు.. జనాల్ని చైతన్యవంతం చేసే మీడియా సంస్థలే తమ ఉద్యోగులకు సెలవులు ఇవ్వవు. ఇంతటి అచేతనావస్థ ఉన్న పరిస్థితుల్లో ఓటు హక్కు వినియోగంపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా దృష్టిపెడుతుందో చూడాలి. అసలే హైదరాబాద్ లో ఎప్పుడూ తక్కువ ఓటింగ్ నమోదవుతుంటుంది. ఇందుకు అసలు కారణమే ఉద్యోగులకు సెలవు ఇవ్వకపోవడం. గత ఎన్నికల్లో 50 శాతం లోపే ఓటింగ్ నమోదవడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కట్టింది. ప్రజాస్వామ్యంలో పోలింగ్ ను స్వేచ్ఛాయుతంగా నిర్వహించడమే కాదు.. ప్రతి ఒక్కరికీ ఓటును సద్వినియోగం చేయడం కూడా ఎలక్షన్ కమిషన్ విధి. మరి ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ప్రైవేటు సంస్థలపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. 1950 నంబరుకు ఇప్పటికే కాల్స్ వెల్లువెత్తుతుంటే ఈ రోజు మరింత భారీయెత్తున కంప్లయింట్స్ వచ్చే అవకాశాలున్నాయి.