Published 01 DEC 2023
బాగా చదువుకున్నోడికి బాగా తెలివి ఉంటుందంటారు. ఆ తెలివి ఏమో కానీ అతి తెలివి మాత్రం ఎక్కువవుతూనే ఉంది. చదువుకున్నోడి(Educated) కంటే మిడిమిడి చదువులు చదివినా లేదా అసలు చదవకున్నా సామాన్యుడే(Uneducated) బెటర్ అని మరోసారి అర్థమైంది. ఐదేళ్లకోసారి జరుగుతున్న ఎన్నికలు చూస్తే ఈ విషయం క్లారిటీగా అర్థమవుతున్నది. పార్లమెంటు ఎన్నికల నుంచి మొన్నటి సర్పంచి, వార్డు మెంబర్ల ఎన్నికల వరకు పరిశీలిస్తే.. ఎక్కడ చూసినా 85%, 90 శాతం కన్నా తక్కువగా ఓటింగ్ నమోదు కాలేదు. కొన్నిచోట్ల 90%, 95% దాకా ఓట్లు పడ్డాయి. పట్టణాల్లో కంటే పల్లెల్లోనే ఓటింగ్ పెద్దయెత్తున నమోదవడంతో అభ్యర్థుల తలరాతలు మారిపోయాయి. జిల్లాల్లో పరిస్థితి ఇలా ఉంటే హైదరాబాద్ లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. అక్కడ ఓటు వేయాలంటేనే బద్ధకంగా భావిస్తున్నారు.
ఓటు వేయకుంటే ప్రాణం పోయినట్లేనా
నాటి కాలం నుంచి పల్లెల్లో ఒక నానుడి ఉంది. ఓటు వేయకుంటే ప్రాణం పోయినట్లేనని. పోలింగ్ కేంద్రం వరకు వెళ్లి ఓటు లేదని తెలిసిందో.. ఇక అంతే సంగతులు. జీవితమే కోల్పోయినంత బాధతో ఉంటారు. కానీ రాష్ట్ర రాజధానిలో మాత్రం ఓటింగ్ అంటే చులకన భావం ఉంది. విందులు, వినోదాల కోసం కాలక్షేపం చేసే జనం ఒక ఓటు వేయడానికి మత్తు వదలడం లేదు. ఇప్పటివరకు జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్ని పరిశీలిస్తే ఎక్కడా 60 శాతం కన్నా ఓటింగ్ మించలేదు. అది కూడా ఒక్క పటాన్ చెరు నియోజకవర్గంలోనే 60 శాతం మించింది. అత్యంత కుబేరులు ఉండే జూబ్లీహిల్స్ లోనైతే 45% కూడా దాటడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పటాన్ చెరు మినహా ఎక్కడా 60% ఎక్కువగా పోలింగ్ నమోదు కాలేదు. ఈసారి భాగ్యనగరంలో అన్ని జిల్లాల కంటే అతి తక్కువగా కేవలం 46.56 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.
హాలిడే ఇచ్చినా ఓటింగ్ కు డుమ్మా
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే పోలింగ్ కు అటెండ్ అయ్యేందుకు ఉద్యోగులకు సెలవు ఇస్తుంటారు. అది కూడా పెయిడ్ హాలిడే(HOP) ఇస్తున్నా కొందరు సెలవు తీసుకుని మరీ ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే ఇదంతా కొద్దిమందికి మాత్రమే వర్తిస్తుందని, ఎక్కువ మంది ఓటు వేయకపోవడానికి ప్రధాన కారణం మాత్రం హాలిడే ఇవ్వకపోవడమేనని స్పష్టమవుతున్నది. పోలింగ్ కు ముందు రోజు ఎలక్షన్ కమిషన్ టోల్ ఫ్రీ నంబరు 1950కు వచ్చిన కాల్స్ ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. తమ కంపెనీలు సెలవు ఇవ్వడం లేదంటూ వేలాదిగా టోల్ ఫ్రీ నంబరుకు కాల్స్ వచ్చాయి. దీనిపై సీరియస్ అయిన CEO వికాస్ రాజ్.. ఆయా కంపెనీలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు.. ఒక్క ఓటు వేయడానికి ఇన్ని కారణాలా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పల్లెటూళ్ల మాదిరిగా ఓటు వేయకుంటే అది అవమానకరంగా భావించిననాడే గ్రేటర్ హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోగలుగుతారు. ఓటు వేయని వారికోసం ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ దృష్టిసారిస్తే తప్ప మార్పు కనపడదు.