రాష్ట్రంలో ఎన్ని నామినేషన్లు పడ్డాయో కొందరు అభ్యర్థుల ఆస్తులు కలిపితే.. నామినేషన్ కో కోటి అన్న చందంగా అన్ని వేల కోట్ల ఆస్తుల వివరాలు తెలిశాయి. ఈ ఎన్నికల్లో మొత్తం నామినేషన్ల సంఖ్య 5,000 ఉండగా.. 3 పార్టీలు(BRS, కాంగ్రెస్, BJP) టాప్-20లో ఉన్న నేతలే ఆస్తులే రూ.5,000 కోట్లు దాటుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఎవరికి వారే వ్యక్తిగతంగా తమ ఎన్నికల అఫిడవిట్ల(Affidavit)లో తెలియజేశారు. ఇందులో టాప్-20లో నిలిచిన అభ్యర్థుల్ని పరిశీలిస్తే రూ.5,000 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలిచిన అభ్యర్థుల ఆస్తులు BRS కంటే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల మొత్తం ఆస్తులు రూ.2,500 కోట్లకు పైగా ఉండగా.. BRSకు చెందిన నేతల వద్ద రూ.2,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ విషయంలో BJP రూ.700 కోట్లకు పైగా ఆస్తులతో థర్డ్ ప్లేస్ లో ఉంది.
కాంగ్రెస్ అభ్యర్థుల్ని పరిశీలిస్తే… చెన్నూర్ నుంచి బరిలోకి దిగిన జి.వివేక్ వద్ద రూ.606.67 కోట్లు, మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వద్ద రూ.458.39 కోట్లు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రూ.433.93 కోట్లు, బెల్లంపల్లి నుంచి పోటీకి దిగిన జి.వినోద్ వద్ద రూ.197.12 కోట్లు, శేరిలింగంపల్లి అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ వద్ద రూ.124.49 కోట్లు ఉన్నాయి.
BRS అభ్యర్థుల్ని చూస్తే… భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి వద్ద రూ.227.51 కోట్లు, దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి రూ.197.40 కోట్లు, నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాకు రూ.124.24 కోట్లు, నాగర్ కర్నూల్ లో మర్రి జనార్దన్ రెడ్డికి రూ.112.33 కోట్లు, నారాయణపేట అభ్యర్థి ఎస్.రాజేందర్ రెడ్డికి రూ.111.42 కోట్లు ఉన్నాయి.
ఇక BJP నుంచి… శేరిలింగంపల్లి అభ్యర్థి ఎం.రవికుమార్ కు రూ.166.93 కోట్లు, కోరుట్ల నుంచి పోటీ చేస్తున్న ధర్మపురి అర్వింద్ కు రూ.107.43 కోట్లు, హుజూరాబాద్, గజ్వేల్ అభ్యర్థి ఈటల రాజేందర్ కు రూ.53.94 కోట్లు, సనత్ నగర్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డికి రూ.51.14 కోట్లు, కామారెడ్డి అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డికి రూ.49.71 కోట్లు ఉన్నట్లు వారి అఫిడవిట్ల ద్వారా బయటపడింది.