
మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 09 Jan 2024
రాష్ట్రంలో ప్రజలకు చేరువగా పాలన తీసుకువస్తున్నామని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం.. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవకతవకలపైనా దృష్టి సారించింది. ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదంటూ ఎన్నికల ప్రచారం నుంచి ఇప్పటివరకు స్పష్టం చేస్తూనే ఉన్నా… ఆ చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ దేన్నీ తేలికగా తీసుకునే ప్రసక్తే లేదన్న భావన కాంగ్రెస్ సర్కారులో కనిపిస్తోంది. అందులో భాగంగానేనా అన్నట్లు అత్యంత సీనియర్ IAS అధికారికి షోకాజ్ నోటీసు పంపింది. ఫార్ములా E రేసింగ్ ఒప్పందాన్ని ఎందుకు కుదుర్చుకోవాల్సి వచ్చింది.. దాని కోసం రూ.55 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు అన్న అంశాలపై సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్ కు నోటీసులు పంపింది. ఈ మేరకు వారం రోజుల్లో ప్రశ్నలకు వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) శాంతికుమారి ఆర్డర్స్ ఇచ్చారు.

ఫార్ములా రేస్ క్యాన్సిల్…
రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్ములా రేసింగ్ ను రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో అర్వింద్ కుమార్.. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన కాలంలోనే ఫార్ములా ఈ-ఈవెంట్ కు బీజం పడింది. అనుమతి లేకుండా ఫార్ములా రేసింగ్ ఒప్పందం చేసుకున్నారన్న రేవంత్ ప్రభుత్వం.. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ నోటీసుల్లో ప్రశ్నించింది. హెచ్ఎండీఏ(Hyderabad Metropolitan Development Authority)కు సంబంధించిన నిధుల్ని రూ.55 కోట్లు ఎందుకు చెల్లించారో తెలియజేయాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ(SCS) కేడర్ లో ఉన్న అర్వింద్ ను మొన్నటి బదిలీల్లో ప్రాధాన్యం లేని విపత్తుల నిర్వహణ శాఖకు పంపించారు. కొంతమంది సీనియర్ల వ్యవహారశైలిపై ముందునుంచి గుర్రుగానే ఉన్న CM.. ఒక కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న ఫార్ములా రేసింగ్ పై సర్కారు నోటీసులు పంపించడం హాట్ హాట్ గా మార్చింది.
నోటీసుల్లో అడిగిన ప్రశ్నలివే
- నిర్ణీత ప్రక్రియను అనుసరించకుండా ప్రైవేటు ఆర్గనైజర్ తో కార్యకలాపాలు నిర్వహించడం పాలనా నిబంధనలకు విరుద్ధం…?
- తగిన అనుమతి తీసుకోకుండా, సమస్యను దృష్టికి తీసుకురాకుండా ప్రభుత్వంపై అదనపు భారం మోపడం…?
- సీజన్ నిర్వహించే ప్రమోటర్ ను అనూహ్యంగా తొలగించాల్సి వస్తే జరగబోయే పరిణామాల గురించి ఎందుకు పరిశీలించలేదు.. ఒప్పందానికి సంబంధించిన నిధులు వృథా అయ్యే పక్షంలో నష్ట నివారణ చర్యలపై ఎందుకు దృష్టిపెట్టలేదు…?
- ఆర్థిక పరిరక్షణకు అవసరమైన కారణాల గురించి పట్టింపు లేకపోవడానికి కారణమేంటి…?
- HMDA నిధుల విషయంలో ఆర్థిక శాఖ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమ్మతి లేకుండానే ఒప్పందంపై సంతకం జరిగింది.. రూ.55 కోట్లు ఎందుకు వెచ్చించారు…?