పాత పెన్షన్ విధానం(OPS) అమలు మరోసారి తీవ్ర చర్చకు వస్తోంది. PRC కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో IR ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. దీనిపై ఎంప్లాయిస్ యూనియన్లు సంతోషం చెందుతున్నా.. OPS కోసం పోరాటాన్ని ఆపొద్దని నిర్ణయించాయి. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో OPS సాధ్యమేనా అన్న అనుమానాలు నెలకొన్నాయి. దీనికోసం ఉద్యోగులు ఎదురుచూపులకు పరిమితమైతే ప్రభుత్వం మాత్రం బెదురుచూపులకు పోవాల్సిన తీరు నెలకొంది. ఇప్పటికే 5 రాష్ట్రాలు ఇందుకు ‘సై’ అన్నా ఇంకా అక్కడ ప్రక్రియ మొదలు కానే లేదు. ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఝార్ఖండ్, రాజస్థాన్ లో OPSను అమలు చేస్తామని ప్రకటించినా ఇంతవరకు చడీచప్పుడు లేదు. అయితే OPSను మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని యూనియన్లు డిమాండ్ చేస్తుండటంతో దాని సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. 2004 అక్టోబరు 1 నుంచి ఉద్యోగాల్లో చేరిన వారికి నూతన పింఛను విధానం(NPS)ను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఎంప్లాయ్ శాలరీలో 10% డబ్బుకు రాష్ట్ర ప్రభుత్వం మరో 10% శాతం కలిపి ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ(PFRDA)’ ట్రస్ట్ కు ప్రతి నెలా నిధులు చెల్లిస్తోంది. సర్కారు చెల్లించే 10 శాతాన్ని 14 శాతానికి పెంచాలని PRC కమిటీ రికమెండ్ చేసింది. కానీ ఇది ఇప్పటికీ అమలు కాలేదు.
ఉద్యోగి రిటైర్ అయినా, మరణించినా 40% వెనక్కు ఇవ్వగా, మిగతా 60 శాతం సొమ్ము ట్రస్టులోనే ఉంటుంది. ఆ ట్రస్టు నిధులతోనే నెలనెలా పెన్షన్ అందుతుంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం OPSను అమలు చేస్తామంటే… తమ మొత్తం సొమ్మును ఎంప్లాయిస్ వెనక్కు తీసుకుని స్టేట్ గవర్నమెంట్ కు జమ చేయాల్సి ఉంటుంది. కేవలం 40% సొమ్మునే వెనక్కు తీసుకునే అవకాశం ఉండటంతో ఈ ప్రక్రియ అంత సులభం(Easy) కాదు. అచ్చంగా ఆ ఐదు రాష్ట్రాల్లో అలాగే జరిగింది. తమ ఎంప్లాయిస్ 2004 నుంచి ఇప్పటివరకు జమ చేసిన ఇంచుమించు రూ.80,000 కోట్లను రిటర్న్ ఇవ్వాలని, తద్వారా OPSను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినా చట్ట ప్రకారం అలా ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. PFRDA యాక్టులో ఎలాంటి వెసులుబాటు లేదని రాజ్యసభలోనూ ప్రకటించింది.
రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల్ని తిరిగి ఇవ్వడం కుదరదని కేంద్రం తేల్చిచెప్పడంతో దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని 5 రాష్ట్రాలు చూస్తున్నాయి. అది ఎప్పుడు జరుగుతుందో కచ్చితంగా చెప్పలేం. ఆ ఐదు రాష్ట్రాలకు మన ప్రభుత్వం తోడవుతుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. ఇపుడున్న పరిస్థితుల్లో PRC కమిటీని వేయాల్సి ఉంది. దీనిపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో అప్పటిదాకా మధ్యంతర భృతి(Interim Relief-IR) అందిస్తామని స్వయంగా కేసీఆరే ప్రకటించారు. దీన్ని బట్టి ‘PRC’, ‘IR’ గురించి ఆలోచించాల్సిందే గానీ OPS అంశం రాష్ట్ర సర్కారు చేతుల్లో లేదన్నది మరికొందరి మాట. PRCపైనే అసందిగ్ధ పరిస్థితులు నెలకొన్న వేళ OPS గురించి ఇక ఆలోచించేదేముంటుంది అన్న భావన కొన్ని యూనియన్లలో కనిపిస్తోంది. కానీ దీనిపై పోరాటాన్ని మరింత సంఘటితం చేయాలని ఇంకొన్ని యూనియన్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఇపుడు ప్రకటించిన IR ఎంత ఉంటుందనేది ఉద్యోగ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చకు దారి తీస్తున్నది.