Published 04 Dec 2023
నోటి నుంచి ఏ మాటొస్తే కొన్నిసార్లు అదే నిజమవుతుందంటారు…
అచ్చంగా ఇప్పుడు అదే తీరు కనపడుతున్నది…
డిసెంబరు 9న ప్రమాణ స్వీకారమని ఏ ముహూర్తాన అన్నారో గానీ…
ఇప్పుడదే జరగబోతుందా అన్న అనుమానమేర్పడింది…
అసలే కాంగ్రెస్ పార్టీ.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.. అలాంటి అనిశ్చితికి మారుపేరైన హస్తం పార్టీలో ఇప్పుడూ అదే తీరు కనపడుతున్నది. CLP నేతను MLAలు ఎన్నుకున్నా… దాని ప్రకటన మాత్రం ఇంతవరకు వెలువడలేదు. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరైన డీకే శివకుమార్ ఉన్నట్లుండి ఢిల్లీ వెళ్లిపోయారు. రాష్ట్ర సీనియర్ నేతలు సైతం సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ప్రమాణస్వీకారం ఉంటుందా లేదా అన్నది క్వశ్చన్ మార్క్ గా తయారైంది. అటు మరో సీనియర్ నేత సైతం ఈ రోజు ప్రమాణ స్వీకారానికి అవకాశం లేదనుకుంటూ వెళ్లిపోవడం సంచలనంగా మారింది. దీంతో AICC పరిశీలకులు సైతం ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు.
అసలేం జరిగింది…
గవర్నర్ ను కలవగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ తమిళిసై ఆదేశాలివ్వడంతో ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుందని భావించారు. చివరకు CM కాన్వాయ్ ని కూడా రాజ్ భవన్ వద్ద రెడీ చేశారు. కానీ ఉన్నట్టుండి CLP సమావేశం నుంచి రాష్ట్ర నేతలతోపాటు పరిశీలన కోసం కర్ణాటక డిప్యుటీ CM డీకే శివకుమార్ కూడా వెంటనే ఎల్లా హోటల్ నుంచి వెళ్లిపోయారు. వీరంతా ఒక్కసారిగా బయటకు వెళ్లిపోవడంతో రాజ్ భవన్ కార్యక్రమంపై క్రమంగా అనుమానాలు ఏర్పడ్డాయి. అప్పుడర్థమైంది.. ఇది అంత సులువుగా మారే పార్టీ కాదని.
పూర్తి రిపోర్టుతో వెళ్లిన DK
ఇలాంటి అనిశ్చితికర స్థితిలోనూ DK శివకుమార్ పూర్తి స్థాయి రిపోర్టును తయారు చేసుకున్నట్లు వార్తలు వినపడ్డాయి. వ్యక్తిగతంగా ఒక్కో MLA అభిప్రాయం తీసుకుని ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి సంబంధించి హైకమాండ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. CLP నాయకుని ఎన్నిక వ్యవహారాన్ని హైదరాబాద్ లో కాకుండా ఢిల్లీలో తేల్చాలని నిర్ణయించారు. ఇందుకోసం తీర్మానాన్ని సీతక్కతోపాటు కొందరు నేతలు ప్రవేశపెట్టగా.. ఆ కాపీని డీకే శివకుమార్ ఆధ్వర్యంలో హైకమాండ్ కు పంపారు. తొలుత 7 గంటలకు కార్యక్రమం ఉంటుందని చెప్పినా, దాన్ని రాత్రి 8:30కు వాయిదా వేశారు. చివరకు అది కూడా రద్దయ్యేలా చేసి.. ప్రమాణ స్వీకారానికి మరో రెండు రోజుల పాటు వేచి చూసే పరిస్థితి తెచ్చుకున్నారు.