
అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని పలువురు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. అధికారుల తీరుపై అసంతృప్తి దృష్ట్యా CEC చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోనే మూడు అత్యంత ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ CPలపై వేటు వేసింది. హైదరాబాద్ CP సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణపై వేటు వేసింది. అటు పలువురు కలెక్టర్లు, SPలపై ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వేటు పడిన వారిలో నలుగురు కలెక్టర్లు ఉన్నారు. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లను బదిలీ(Transfers) చేస్తూ ఉత్తర్వులు(Orders) ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డిపై ఈసీ వేటు వేసింది.
కీలక శాఖలకు ఇక స్పెషల్ సెక్రటరీలు
మరోవైపు వివిధ జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్ పోర్ట్ సెక్రటరీతోపాటు, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముషారఫ్ అలీని బదిలీ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. అటు వాణిజ్య పన్నుల శాఖ(Commercial Taxes Department) కమిషనర్ TK శ్రీదేవిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని, రేపు సాయంత్రం 5 గంటల వరకు అందుకు అర్హత గల ప్యానెల్ పంపాలని ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. చీఫ్ సెక్రటరీ పరిధిలో ఉన్న స్పెషల్ సెక్రటరీలను ఆయా డిపార్ట్ మెంట్లకు పంపాలని స్పష్టం చేసింది.
మొన్నటి పర్యటనలోనే ఈసీ ఆగ్రహం
ఇటీవలి పర్యటన సందర్భంగా రాష్ట్ర ఉన్నతాధికారుల తీరుపై ఎలక్షన్ కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించిన ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ తోపాటు మిగతా ఇద్దరు కమిషనర్లు తీవ్రంగా ఆగ్రహం కనబరిచారు. ప్రలోభాలపై దృష్టిపెట్టడం లేదని.. నగదు, మద్యం, ఇతర తాయిలాలను పట్టుకోవడంలో శ్రద్ధ చూపడం లేదని మండిపడింది. మరోవైపు అటు విపక్షాలు సైతం రాష్ట్రంలోని పలువురు ఉన్నతాధికారుల వ్యవహారశైలిపై ఈసీకి కంప్లయింట్ ఇచ్చాయి. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పేర్లతో సహా కొంతమంది లిస్టును హస్తం పార్టీ సీనియర్ లీడర్లు CECకి అందజేశారు.