
Published 15 Dec 2023
ప్రతిభ గల అభ్యర్థులకు పట్టం కట్టాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషన్.. రాష్ట్రంలో అచేతనంగా తయారైన సంగతి తెలిసిందే. అలాంటి అపప్రథ(Bad Name) మూటగట్టుకున్న TSPSC నుంచి మరొకరు ఔటయ్యారు. ఎవరో చేసిన తప్పిదానికి తాము బాధ్యులం కావాల్సి వస్తున్నందువల్లే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ కమిషన్ సభ్యుడు కారం రవీందర్ రెడ్డి రాజీనామా చేశారు. కమిషన్ ఛైర్మన్ బి.జనార్ధన్ రెడ్డి తన బాధ్యతల నుంచి వైదొలిగిన మరుసటి రోజే సభ్యుడు ఆర్.సత్యనారాయణ రిజైన్ చేశారు. తాజాగా మరో మెంబర్ అయిన కారం రవీందర్ రెడ్డి సైతం కమిషన్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 11న రేవంత్ రెడ్డిని కలిసిన వెంటనే జనార్ధన్ రెడ్డి రాజీనామా లేఖను పంపితే 12 నాడు ఆర్.సత్యనారాయణ వైదొలిగారు.
ఆ ఇద్దరి వల్లే అప్రతిష్ఠనా…
రాజీనామా చేస్తూ కారం రవీందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిజంగా ఆ ఇద్దరే కమిషన్ కు చెడ్డపేరు తెచ్చారని ఆరోపించారు. TSPSCలో ఇద్దరు సీనియర్ IAS అధికారులు ఉన్నా సరైన నియంత్రణ లేదన్న విమర్శలున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండుసార్లు క్యాన్సిల్ కావడంతో కమిషన్ అభాసుపాలైంది.
అటు AEE, AE, DAO(Divisional Accounts Officers) ఎగ్జామ్స్ కూడా రద్దు కాగా.. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్(TPBO), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల తేదీల్ని మార్చింది. లీకేజీలపై గత ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహిస్తే లీకేజీలు నిజమేనని నిర్ధారణైంది. క్వశ్చన్ పేపర్స్ ను కొన్న 100 మందిని రిమాండ్ కు తరలించడంతోపాటు భవిష్యత్తులో వారంతా ఇక పరీక్షలు రాయకుండా డిబార్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.